మీడియాకు సమాచారం అక్కర్లేదు మసాలా మాత్రమే కావాలి. అలాగని అందరినీ ఒకటే గాటన కట్టేయడం కూడా తప్పే.
వార్తల్ని వదిలేసి మసాలాను మాత్రమే నమ్ముకుని బతికే ధోరణులు మీడియాలో కొందరు అనుసరిస్తుంటారు. ఈ ధోరణులకు తెలుగులో శ్రీకారం దిద్దింది మాత్రం టీవీ 3×3. అలాంటి టీవీ 9కు తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా ఝలక్ ఇచ్చారు.
ఈనెల 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డే జరిగింది. అభిమానులు, జన సైనికులు ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు. పవన్ పుట్టినరోజును ప్రతిసారీ అలాగే జరుపుకుంటారు. కాకపోతే ఈ సారి కరోనా నేపథ్యంలో.. ఆక్సిజన్ కొరత అనే ఒకే ఒక కారణం రాష్ట్రంలో వందల మంది కరోనా రోగుల్ని బలి తీసుకుంటున్న సమయంలో వారు ఆక్సిజన్ సిలిండర్ యూనిట్లను ఆస్పత్రులకు వితరణ చేశారు. ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉంది. అవి దొరకడం లేదంటూ ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది. ఇలాంటి సమయంలో ‘‘చనిపోయాక ప్రభుత్వం 15వేలు ఇస్తోంటే.. బతికించడంకోసం 10 వేల ఖర్చుతో ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తాం’’ అనే నినాదంతో జనసైనికులు ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 621 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాదులో కూడా సిలిండర్లు అందజేశారు.
ఒక రకంగా చూసినప్పుడు, ఈ సీజన్లో ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. 621 సిలిండర్లు జనసేన అధికారికంగా ప్రకటించిన మేరకు ఒక్కోటీ 10వేలు అనుకుంటే.. 62లక్షల 10 వేల రూపాయలు అవుతాయి. ఇది జనసేనాని పుట్టిన రోజుకు ఆయన అభిమానులు పెట్టగల ఖర్చుతో పోలిస్తే ఏమంత పెద్దమొత్తం కాదు. కానీ.. అసలే ఆక్సిజన్ సిలిండర్ల కొరత బీభత్సంగా ఉన్నవేళ.. వాటిని సమకూర్చే సాయం చిన్నది కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ బర్త్ డే సందర్భంగా.. సహజంగానే మీడియా ప్రత్యేక కథనాలు అందించింది. రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు థాంక్స్ టూ ఆల్ మెసేజీతో చేతులు దులిపేసుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ కాస్త ప్రత్యేకంగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిన వారికి, మీడియా వారికి, ప్రత్యేకంగా వెబ్ మీడియా నిర్వాహకులకు ఇలా పేరుపేరునా విడివిడిగా తన కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ సంస్కారాన్ని అందరూ మెచ్చుకున్నారు కూడా.
అక్కడే మొదలైంది అసలు గొడవ. ప్రస్తుతం సింగిల్ కేరక్టర్ సినిమా చేసేసి, దాన్ని విడుదల చేసుకునే లోగా కాస్తంత జనం దృష్టిలో పడాలని ఆరాటపడుతున్న హీరోయిన్ మాధవీలత రంగంలోకి వచ్చారు. పవన్ బర్త్ డేని తన మైలేజీకి వాడుకోవడానికి ఆమె ఆరోజు ఇంకో ప్రయత్నం కూడా చేశారు. పవన్ కలగని, చేయాలనుకుని, తర్వాత వదిలేసిన ‘సత్యాగ్రహి’ టైటిల్ తో తాను ఒక సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. పవన్ ఇలా సోషల్ మీడియా, వెబ్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పిన తర్వాత.. మాధవీలత స్పందించి తన ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
పవన్ కల్యాణ్ ఆ రకంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా పెద్ద నేరం అయినట్టుగా ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. కాలేజీ చదివేప్పుడు రాసిన ప్రేమలేఖ తప్ప.. మీకెప్పుడూ నేరుగా ఏమీ రాయలేదని అంటూనే.. పవన్ ను అందులో ఒక రేంజిలో విమర్శించారు. ‘‘వాళ్ళకి మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం నాకు చాల కోపం తెప్పించింది. మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై . ఇక్కడ సెలెబ్రిటీలకి పెట్టె అవసరమే లేదు. ఎవడికి మీ మీద ప్రేమ లేదు’’ అంటూ పవన్ కు చాలా సలహాలే ఇచ్చేశారు. టాలీవుడ్ లో డ్రగ్స్ మీద పోరాడాలని పవన్ కు సందేశం కూడా ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది నటులంటూ విభజించి పాలించే సూత్రాన్ని.. ‘ఒకటే దేశం’ అనే నినాదాన్ని ప్రవచించే భాజపా నాయకురాలు ఆ పోస్టులో వెళ్లగక్కడం విశేషం. జన సైనికులు తనను ఈ పోస్టుపై తిట్టిపోయాలని ఆమెకు చాలా కోరిక ఉన్నట్టుగా, ‘డియర్ హేటర్స్ యూ కెన్ బార్క్ ఆన్ మై వాల్’ అంటూ పిలుపు కూడా ఇచ్చారు.
అయితే ఆమె వివాదం కావాలని కోరుకున్న ఈ పోస్టును టీవీ 3×3 అంది పుచ్చుకుంది. దీనికి కాస్త మసాలా జోడించింది. పవన్ ను మాధవీలత ఇంకాస్త ఘాటుగా నిందించినట్టుగా ఒక సుదీర్ఘమైన వార్తాకథనాన్ని తమ బులెటిన్లో నడిపించింది.
తానేదో సంస్కారంగా థాంక్స్ చెబితే అందులో కూడా రంధ్రాన్వేషణ చేసి.. అర్జంటుగా తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి మాధవీలత చేసిన ప్రయత్నం ఆమె పోస్టులో అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె ట్రాప్ లో టీవీ9 చిక్కుకున్నదా లేదా, టీవీ 9 ట్రాప్ వేసిందా తెలియదు. పది టికెట్లయినా అమ్ముడుపోయేంత దిక్కూమొక్కూ ఉంటుందో లేదో తెలియని ‘లేడీ’ సినిమాకు బీభత్సంగా ఉపయోగపడేలా.. మాధవీలతకు ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేసింది. ఆమెను లైవ్ లోకి తీసుకుని ఎపిసోడ్ నడిపించింది. పవన్ కల్యాణ్ మీద నెగటివ్ గా ఎవరో ఒకరు మాట్లాడుతోంటే.. జనం పిచ్చ క్రేజీగా ఎగబడి చూస్తారనే ఆరాటం తప్ప టీవీ9 నడిపిన బులెటిన్లో మరొక పాయింట్ లేదు.
మామూలుుగా అయితే ఇక్కడితో అంతా సమసిపోతుంది. కానీ పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకో సీరియస్ అయ్యారు. టీవీ9కు పార్టీనుంచి ఘాటుగా ఒక లేఖ రాశారు. అందులో సుతిమెత్తగా టీవీ 9 వారి ఆరాటాన్ని ఎక్కిదిగేశారు. కృతజ్ఞతలకు కూడా వక్రభాష్యం చెప్పడం భావ్యం కాదు, దేశసమైక్యతకు వ్యతిరేకంగా, ప్రాంతీయ భేదభావాలను రెచ్చగొట్టేలా టీవీ9 ప్రసారం చేసింది.. వేర్పాటువాద ధోరణితో కూడిన సోషల్ మీడియా పోస్టును మీరు ప్రసారం చేయడం కరెక్టు కాదు.. అంటూ చాలా ఘాటు పదజాలంతో సుతిమెత్తగా ఆ లేఖలో ప్రశ్నించారు. భవన నిర్మాణ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో కూడా ఏ రాష్ట్రం వారు ఎక్కడైనా పనిచేస్తారంటూ ఆ లేఖలో పేర్కొంటూ.. పరోక్షంగా టీవీ 9 యాజమాన్యాన్ని ప్రస్తావించడం కూడా వారికి కంగారు పుట్టించింది. జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు ఆ ఉత్తరం రాశారు.
ఆ దెబ్బకు కంగారుపడిన టీవీ3×3- వెంటనే ఓ వివరణ ఉత్తరాన్ని కూడా పంపుకోవాల్సి వచ్చింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని, మీ పార్టీ ప్రతినిధితో కూడా తాము మాట్లాడామని.. ఉద్దేశపూర్వకంగా జరగలేదని టీవీ3×3 సంజాయిషీ ఇచ్చుకుంది.
ఎందుకు భయపడ్డారంటే…
బురద చల్లేసి.. ఆ తర్వాత వివాదం ముదిరితే వేడుకగా చూస్తూ కూర్చోవడం ఇవాళ మీడియాలో చాలా మందికి అలవాటు అయిపోయింది. అయితే పవన్ కల్యాణ్ చాలా సుతిమెత్తగా రాసిన లేఖకు, వెంటనే ఎందుకు సంజాయిషీ ఇచ్చారనేది కీలకాంశం. దేశసమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగించే విధంగా టీవీ3×3 ప్రసారాలు ఉన్నాయంటూ పవన్ కల్యాణ్ తరఫున చేసిన వ్యాఖ్యలు మెత్తగా కనిపించినా చాలా పదునైనవి. ఇంకోసారి ఇలా జరిగితే.. ఈ బులెటిన్ ను, ఈ లేఖను, జతచేసి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే గనుక.. చిటికెలో టీవీ3×3 అనేది అదృశ్యం అయిపోతుంది. అసలే పవన్ కల్యాణ్, ఆపై బీజేపీతో మైత్రీబంధం ఉన్న నాయకుడు. సంజాయిషీ ఇచ్చుకోకుంటే మొదటికే మోసం వస్తుందని టీవీ 9 భయపడ్డట్టుగా కనిపిస్తోంది. అందుకే- జనసేన, పవన్ కల్యాణ్ వార్తలకు తాము చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. ఏదేమైనా గానీ.. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఝలక్ తో, మళ్లీ ఇలాంటి అనవసరపు కెలుకుడు జోలికి వెళ్లకుండా టీవీ 3×3 కాస్త ఒళ్ల దగ్గరపెట్టుకుని వ్యవహరిస్తుందని అనుకోవచ్చు.
పవన్ కల్యాణ్ చెప్పిన కృతజ్ఞతల్ని ఈసడిస్తూ మాధవీలత పెట్టిన పోస్ట్ :
Pawan Kalyan డియర్ పవన్ కళ్యాణ్ మీకు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్ గ పెట్టలేదు నేను ఎపుడో కాలేజీ లో ఉన్నపుడు…
Posted by Actress Maadhavi on Friday, 4 September 2020