తెలుగు తెరమీద ఒకప్పుడు నవ్వులు పువ్వులు పూయించిన లెజండరీ దర్శకుడు జంధ్యాల. విచిత్రమైన పాత్రలు, ఆ పాత్రలకు ఆయన క్రియేట్ చేసిన మేనరిజమ్స్, ప్రవేశపెట్టిన ఊతపదాలు.. ఆ పాత్రలు ప్రవర్తించే తీరు, వారి అభినయం అద్భుతం. జంధ్యాల దర్శకుడు అవడానికి ముందే ఆయన గొప్ప రచయిత కాబట్టి.. అన్ని వెరైటీ పాత్రల్ని ఇట్టే సృష్టించగలిగారు.
పాత్రలకు తగ్గట్టుగానే గొప్ప నటీనటులు ఆయనకి లభించారు కాబట్టే.. ఆయన సినిమాలన్నీ ఇప్పటి దర్శకులకు పాఠాలుగా మారాయి. అలాంటి జంధ్యాలకి ‘మాయా బజార్’ సినిమా అన్నా.. అందులోని పాత్రలన్నా ఎంతో ఇష్టం. ఎంతిష్టమంటే.. ‘మాయాబజార్’ లోని సూపర్ హిట్ పాటల పల్లవుల్ని తన సినిమాలకు టైటిల్స్ గా పెట్టేంత. అప్పటికి ‘మాయా బజార్’ సినిమా విడుదలై.. ముప్పై ఏళ్ళయింది. ఇంతకీ ఆ సినిమాలేంటో చూసేద్దాం…
అహనా పెళ్ళంట!
మాయాబజార్ సినిమాలో శశిరేఖ పాత్ర ధారి సావిత్రి శరీరంలోకి ఘటోత్కచుడు ప్రవేశించి చేసే అల్లరి మీకు తెలిసిందే. తన పెళ్లి నిశ్చయించిన సందర్భంగా.. శశిరేఖ శరీరంలోని ఘటోత్కచుడు మంచి హుషార్ గా అహనా పెళ్ళియంట.. ఓహో నా పెళ్ళియంటా.. అంటూ పాట పాడి.. నవ్వులు పువ్వులు పండిస్తాడు. ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. అందుకే జంధ్యాల ఆ పాట పల్లవితోనే రాజేంద్రప్రసాద్, రజినీ, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలుగా చేసుకొని అహనా పెళ్ళంట అనే సినిమా తీశారు. ఆది విష్ణు సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా జంధ్యాల తీసిన సినిమాల్లోకెల్లా క్లాసిక్ గా నిలిచింది. ఆ తర్వాత ‘ఓహోనా పెళ్ళంట’ అనే పేరుతో కూడా జంధ్యాల సినిమ తీశారు. హరీశ్, సంఘవి నటించిన ఈ సినిమాను కూడా రామానాయుడు నిర్మించారు.
వివాహభోజనంబు
‘మాయాబజార్’ సినిమాలోని మరో సూపర్ హిట్ సాంగ్ ‘వివాహభోజనంబు’. ఘటోత్కచుడు పాత్రధారి యస్వీఆర్.. పెళ్ళివారింట ఆహార పదార్ధాల్ని ఆవిరావిరంటూ ఆరగించే సందర్భంలో ఈ పాట వస్తుందన్న సంగతి తెలిసిందే. మాధవపెద్ది సత్యం పాడిన ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ పాట పల్లవితో జంధ్యాల రాజేంద్రప్రసాద్, అశ్వని జంటగా ఓ నవ్వుల సినిమా తీశారు. ఇందులో రాజేంద్రప్రసాద్ స్త్రీ ద్వేషిగా నటించగా.. సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు, బ్రహ్మానందం అద్భుతమైన హాస్యాన్ని పండించారు.
చూపులు కలిసిన శుభవేళ
మాయాబజర్ సినిమాలో అభిమన్యుడు, శశిరేఖ ప్రణయావేశంతో పాడుకొనే సూపర్ హిట్ సాంగ్ ‘చూపులు కలిసిన శుభవేళ.. ఎందుకు నీకు కలవరమూ. ఈ పల్లవితో కూడా జంధ్యాల నరేశ్, మోహన్, అశ్వని పాత్రలతో సినిమా తీశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టైంది. అంతేకాదు ఇందులో చూపులు కలిసిన శుభవేళ అనే పాటను వీరభద్రరావు, నరేశ్ ల మీద రీమిక్స్ చేసి మరీ చిత్రీకరించారు. ఇందులో వీరభద్రరావు, కోటశ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం చేసే కామెడీ ఎవర్ గ్రీన్.
హై హై నాయకా
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి స్థావరంలో ఆయన ఎంటరయ్యేటప్పుడు .. అనుచరులు చేసే జయ జయధ్వానమే ‘హై హై నాయకా’. ఇదే టైటిల్ తో జంధ్యాల నరేశ్, జయభారతి జంటగా సినిమా తీశారు. పిల్లలు ఇంట్లో పెద్దవారు ఏం చేస్తారో దాన్నే అనుసరిస్తారు. అనుకరిస్తారు. మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడును ఫాలో అవుతారని.. వారి పెంపకంలోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని ఈ సినిమా ద్వారా చక్కటి సందేశమిచ్చారు జంధ్యాల. కోటశ్రీనివాసరావు, మాస్టర్ విన్నకోట కిరణ్, విన్నకోట విజయరామ్, సూర్యాకాంతం, పొట్టిప్రసాద్, సుత్తివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
Must Read ;- బిల్డప్ బాబాయ్ గా బ్రహ్మానందం.. ఇంతకీ ఏ సినిమా?