కొన్ని సినిమాలు కొందరు హీరోల కెరీర్ కి ట్రేడ్ మార్క్ గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు అభిమానులు, సామాన్య ప్రేక్షకులు సైతం ఎవర్ గ్రీన్ గా ముద్ర వేస్తారు. అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన మహా మాస్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఎప్పుడూ ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను పంచే విజయబాపినీడు.. చిరు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. 1991, మే 9న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది.
అప్పట్లో విజయబాపినీడు పర్టిక్యులర్ గా చిరంజీవి మీద ప్రత్యేకంగా నడిపే చిరంజీవి అనే మాసపత్రిక లో వచ్చిన ఒక సీరియల్ టైటిల్ ను ఈ సినిమాకి ఖాయం చేశారు. నిజానికి ఈ సినిమా విజయబాపినీడు .. ఎప్పుడో తీసిన ‘బొమ్మరిల్లు’ అనే సినిమా స్టోరీ లైన్ నే ఫాలో అయ్యారు. రఘుపతి రాఘవ రాజారామ్ అనే ఓ ముగ్గురు అన్నదమ్ముల కథగా ఈ సినిమా తెరకెక్కింది. వీరిలో ఆఖరివాడైన రాజారామ్ .. తన పెద్దన్న రఘుపతి చనిపోతే.. ఇంటి బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు. అలాగే.. రెండో అన్న రాఘవ చదువుకు ఆర్ధికంగా సాయం చేస్తాడు. ఈ క్రమంలో తన పెద్దన్నను చంపిన వారి మీద ప్రతికారం తీర్చుకోవడమే కాకుండా.. విడిపోయిన తన కుటుంబాన్ని మళ్ళీ ఎలా ఒకటి చేస్తాడు అన్నదే సినిమా కథాంశం.
రాజారామ్ గా చిరంజీవి నటన, డ్యాన్స్ . ఫైట్స్, డైలాగ్స్, హీరోయిన్ విజయశాంతి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిపోయాయి. ముఖ్యంగా చెయ్యిచూశావా ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ ఆడించేస్తాను అనే చిరు ఊతపదం అప్పట్లో సెన్సేషన్ అయింది. అలాగే.. బప్పీలహరి సంగీతం ఈ సినిమాకి మరో ఆకర్షణ. ఇందులోని అన్ని పాటలు అప్పటి అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. ఇక రావుగోపాలరావు , ఆనంద్ రాజ్ విలనిజం, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్ కామెడీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో మురళీ మోహన్, శరత్ కుమార్, అన్నపూర్ణమ్మ, సుధ, నిర్మలమ్మ, నారాయణరావు, హరిప్రసాద్, వల్లభనేని జనార్ధన్, నవభారత్ బాలాజీ, సుమలత, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సినిమాకి హైలైట్స్ గా నిలిచిపోయాయి.
అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమాను అదే పేరుతో తమిళంలో డబ్ చేస్తే .. అక్కడ కూడా సూపర్ హిట్టైంది సినిమా. ఇక ఇదే సినిమాను చిరంజీవి ‘ఆజ్ కా గూండారాజ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. 30 ఏళ్ళు అయినప్పటికీ.. ఈ సినిమా ఇంకా అభిమానుల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉంది. దటీజ్ గ్యాంగ్ లీడర్ ..