ఏపీలో ఎన్నికల తర్వాత కీలక పరిణామాలను చూడాల్సి వస్తోంది. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్.. శాంతి భద్రతల పేరుతో హడావుడి చేస్తుండగా.. మరోవైపు, ఆయన్ను ఇరుకునే పెట్టేలా కలయికలు జోరందుకుంటున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్‌లో విజయమ్మను జేసీ ప్రభాకర్ కలిసి.. సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించారని అంటున్నారు.
అయితే, వీరి భేటీలో ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కచ్చితంగా చర్చకు వస్తాయనేది ఎవరైనా ఊహించగలరు. వైఎస్ జగన్ రెడ్డి, వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం మర్యాదపూర్వక భేటీనే అని ఇరు వర్గాల వారు బయట చెప్పుకుంటున్నారు. అయితే, నిజానికి వైఎస్ ఫ్యామిలీకి.. జేసీ ఫ్యామిలీకి గతంలో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైఎస్ హయాంలో రెండు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగారు.
కానీ, జేసీ బ్రదర్స్‌కు జగన్ అంటే అస్సలు పడదు. చాన్స్ దొరికితే చాలు ఇద్దరూ బూతులతో జగన్ పై ఒంటికాలిపై లేస్తుంటారు. అలాంటిది సడన్‌గా జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్ భేటీ కావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై కాసేపటికి జేసీ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళగా.. వెయిటింగ్ లాంజ్ లో వైఎస్ విజయమ్మ కనిపించడంతో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది. ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.
దీంతో జేసీకి వైఎస్ ఫ్యామిలీతో ఉన్న పూర్వపు పరిచయాల కారణంగానే విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి పరిణామం జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించే అంశంగానే చూస్తున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా గుడ్డెద్దు చేలో పడిన చందంగా పోరాటం చేస్తున్నారు. అర్థం లేని విషయాలను, పైగా తన పాలనలో తాను చేసిన తప్పులనే ఇప్పుడు ఎత్తిచూపుతున్నారు. ఫలితంగా జగన్ చేస్తున్న పోరాటం పూర్తిగా నవ్వులపాలు అవుతోంది. ఇలాంటి సమయంలో జగన్ తల్లి విజయమ్మ- జేసీ బ్రదర్ కలవడం వైసీపీ శ్రేణుల్లోకి మరింత వ్యతిరేక సంకేతాలను పంపే అవకాశం ఉందని అంటున్నారు.











