Jindal Steel Plant In Nellore District :
కడప ఉక్కు కోసం ఏళ్ల తరబడి ఆ జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా.. ఆర్థిక నేరగాడిగా, అక్రమ మైనింగ్ కింగ్ గా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డితో బ్రాహ్మణి స్టీల్ పేరిట ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు భూములు కేటాయించారు. పనులూ మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే.. గాలి అక్రమ కేసుల్లో చిక్కుకుని శ్రీకృష్ణజన్మస్థానం చేరారు. ఆయన మాదిరే ఆదాయానికి మించిన కేసుల్లో జగన్ కూడా జైలుకు షిఫ్ల్ అయిపోయారు. ఇదంతా తెలిసిన కథే అయినా.. మరి ఏపీకి సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టాక అయినా కడప జిల్లా ప్రజల *ఉక్కు* కోరిక తీర్చాలి కదా. ఆ దిశగా అడుగులు వేస్తామని ప్రకటించిన జగన్.. ఇప్పటిదాకా ఏం చేశారో? అసలు కడప ఉక్కు తాజా పరిస్థితి ఏమిటో? చెప్పడం లేదు. మొత్తంగా కడప జిల్లా ప్రజల కలను జగన్ అటకెక్కించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త కంపెనీలు ఆహ్వానించదగ్గవేగా
ఇలాంటి తరుణంలో అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెట్టాడన్న చందంగా కడప ఉక్కుపై తేల్చని జగన్.. ఇప్పుడు ఏకంగా నెల్లూరు జిల్లాలో కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏకంగా జిందాల్ సంస్థకు 860 ఎకరాల భూమిని కేటాయించారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లా పరిధిలోని తమ్మినిపట్నం-మోమిని పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ సంస్థ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లుగా జగన్ సర్కారు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా.. 15,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లుగా ప్రభుత్వం అందులో ప్రకటించింది. రాష్ట్రానికి వచ్చిన కీలక పరిశ్రమలు ఓ వైపు వెనుదిరిగిపోతూ ఉంటే.. ఇలా కొత్త కంపెనీలు.. కొత్త ఫ్యాక్టరీలు పెట్టేందుకు వస్తుంటే.. ఆహ్వానించాల్సిందే గానీ.. మరి ఏళ్ల తరబడి జనం నోళ్లలో నానుతున్న కడప ఉక్కు లాంటి పరిశ్రమల గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కడపపై జిందాల్ వెనకడుగు
ఇక్కడ మరో అంశాన్ని కూడా ప్రస్తావించాలి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న జిందాల్.. గతంలో జగన్ సర్కారు విజ్ఞప్తి మేరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కడప జిల్లాలో సదరు ఫ్యాక్టరీకి ప్రభుత్వం కేటాయించిన భూములనూ పరిశీలించింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. కడప ఉక్కు ఏర్పాటుకు జిందాల్ వెనకడుగు వేసింది. అందుకు గల కారణాలు తెలియరాలేదు. మరి కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి వెనుకంజ వేసిన జిందాల్ కు నెల్లూరు జిల్లాలో అదే తరహాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు జగన్ సర్కారు వెనువెంటనే భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించేదే.
Must Read ;- డీల్ కుదరకపోతే కూల్చుడే.. విశాఖ సాగరతీరంలో అధిష్టాన నేత దందా!