AP Govt Initiates Probe In Kathi Mahesh Death :
పదిరోజుల క్రితం నెల్లూరు జిల్లా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేశ్ నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, బ్రెయిన్ కు దెబ్బ తగలటంతో పాటుగా రెండు కళ్లు చూపు కోల్పోయారు. మెరుగైన చికిత్స కోసం మహేశ్ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కంటికి ఆపరేషన్ సైతం నిర్వహించారు. ఆయన కోలుకుంటున్నాడంటూ ఆయన కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా చికిత్స కోసం రూ 17 లక్షలు మంజూరు చేసింది. అయితే అపోలోలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ చనిపోవడం అందర్నీ షాక్ గురి చేసింది.
మృతిపై అనుమానం
మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రమాదంలో మహేశ్ తీవ్రంగా గాయపడితే, డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ఆరోపించారు. కత్తికి శత్రువులు ఉన్నారని, ఆయనపై చాలాసార్లు దాడులు జరిగాయని స్పష్టం చేశారు. కత్తి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. మరోవైపు కత్తి మహేశ్ తండ్రి ఓబులేసు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మహేశ్ చనిపోయిన విషయాన్ని తమకు ఆలస్యంగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల విచారణలో డ్రైవర్
కత్తి మహేశ్ మరణంపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేసిన సురేశ్ ని పిలిచి పోలీసులు విచారించారు. మహేశ్ తీవ్రంగా గాయపడితే, సురేశ్ కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనే కోణంలో విచారణ జరగింది. ఏపీ పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- అర్ధాంతరంగా ముగిసిన కత్తి మహేష్ జీవితం