Are AP Deputy CM’s Not At The Benchmark :
ఏపీకి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని గొప్పగా ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎప్పుడూ లేని రీతిలో ఆయా వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అన్నట్లుగానే.. ఐదు కీలక సామాజిక వర్గాలకు ఆయన డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టారు. ఆ డిప్యూటీల్లో ఎస్టీ కోటా నుంచి పాముల పుష్పశ్రీవాణి, ఎస్సీ కోటా నుంచి నారాయణ స్వామి, బీసీ కోటా నుంచి ధర్మాన కృష్ణదాస్, మైనారిటీల నుంచి అంజాద్ బాషా, కాపుల నుంచి ఆళ్ల నానిలకు డిప్యూటీలుగా పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అంటే.. సీఎం తర్వాత పోస్టు వారిదే కదా. మరి రాష్ట్రంలో ఈ డిప్యూటీల పరిస్థితి అలాగే ఉందా? అంటే.. డిప్యూటీ సీఎం హోదా లేకుండా కేవలం మంత్రులుగా కొనసాగుతున్న వారి కంటే కూడా హీనమైన స్థితిలో ఈ డిప్యూటీ సీఎంలు ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆయారాం.. గయారాం.. పుష్పశ్రీవాణి
ఈ వాదనలు నిజమేనని చెప్పేందుకు ఆయా డిప్యూటీల పనితీరుపై జనం తమదైన శైలి విశ్లేషణలు చేస్తున్నారు. ఎస్టీ కోటా నుంచి డిప్యూటీగా పదవి దక్కించుకున్న పాముల పుష్పశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖను పర్యవేక్షిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ వ్యవహారాల్లో కూడా ఆమె తన సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. అసలు పాలన అంటే కూడా పెద్దగా తెలియని నేతగా పుష్పశ్రీవాణి పేరు సంపాదించుకన్నారు. ఏదో వచ్చామంటే వచ్చా.. వెళ్లామంటే వెళ్లామన్న రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. ఆమె నైజం బోధపడిన అధికారులు కూడా ఆమెకు పెద్దగా ప్రాధాన్యతే ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నారాయణస్వామికి అవకాశమే దక్కట్లేదా?
ఇక ఎస్సీ కోటా నుంచి డిప్యూటీగా ఉన్న నారాయణ స్వామి.. ఎక్సైజ్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోంది. సర్కారీ ఆదాయాన్ని పెంచడంతో పాటుగా నూతన పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ శాఖ వ్యవహారాలన్నింటినీ జగనే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ శాఖకు చెందిన ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా నారాయణ స్వామి తీసుకోవట్లేదు. ఎందుకంటే.. ఇవన్నీ కూడా జగన్ పాలనకు గీటురాయిగా మారేవే. జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు పాలు అవుతున్న నేపథ్యంలో మద్యం పాలసీ వాటిలో తొలి వరుసలో ఉందని చెప్పాలి. ఇక నారాయణ స్వామిపై అవినీతి ఆరోపణలు, ఆయన మాటను లెక్క చేయని అధికారుల తీరుతో ఆ శాఖలో రచ్చరచ్చ సాగుతోంది.
డిప్యూటీ గౌరవం కూడా దక్కట్లేదట
ఇక మైనారిటీ కోటా నుంచి డిప్యూటీగా ఉన్న అంజాద్ బాషా.. అసలు ఏ శాఖకు మంత్రిగా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. మైనారిటీ వ్యవహారాల శాఖను పర్యవేక్షిస్తున్న ఆయన.. పనితీరులో జీరోగానే నిలుస్తున్నారు. మైనారిటీ శాఖలో ఆయనను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలూ లేకపోలేదు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో డాబూ దర్పం చూపించేందుకు అంజాద్ బాషా చేస్తున్న మాత్రం బెడిసికొడుతుండగా.. ఆయన అభాసుపాలవుతున్నారు. కనీసం తన శాఖలో కాదు కదా.. తన జిల్లా, తన నయోజకవర్గంలో కూడా ఆయన మాటను లెక్క చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read ;- పార్టీ తర్వాతే ఎవరైనా.. సీనియర్లయినా జాన్తా నై!
ఎందుకూ కొరగాకున్నారే
బీసీ కోటా నుంచి డిప్యూటీ ఎన్నికైన ధర్మాన కృష్ణదాస్ కీలకమైన రెవెన్యూ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆ శాఖలో జరుగుతున్న ఓ ఒక్క పరిణామం కూడా ఆయన అనుమతితో జరగడం లేదు. నేరుగా సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలతోనే ఆ శాఖ వ్యవహారాలు నడుస్తున్నాయి. కనీసం ఆ శాఖ సమీక్షలకు హాజరై.. ఆయా అంశాలపై స్పష్టంగా మాట్లాడే సత్తా కూడా ఆయనకు లేదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు గతంలో రెవెన్యూ మంత్రిగా తనదైన శైలిలో సత్తా చాటితే.. ఇప్పుడు అదే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్న కృష్ణదాస్ మాత్రం ఎందుకూ కొరగారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఆళ్లను అసలు పట్టించుకోవట్లేదట
ఇక చివరగా కాపు కోటా నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కూడా పెద్దగా పొడుస్తున్నదేమీ లేదనే చెప్పాలి. కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని.. తన శాఖపై ఇప్పటికీ పట్టు సాధించలేదనే ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని కంటే కూడా ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ (గతంలో జవహర్ రెడ్డి)లకే జగన్ ప్రాధాన్యం ఇచ్చేవారన్న వాదనలు లేకపోలేదు. రాష్ట్రంలో కరోనా నివారణ కోసం జరుగుతున్న సమీక్షల్లోనూ నానికి పెద్దగా ఇంపార్టెన్సే దక్కడం లేదట. అంతా ఆ శాఖ కార్యదర్శితోనే మాట్లాడుతున్న జగన్ పని కానిచ్చేస్తున్నారట. మంత్రిగా.. అంతకుమించి డిప్యూటీ సీఎంగా ఉన్న నానిని సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న కోణంలోనూ ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
మంత్రుల కంటే దిగదుడుపే
మొత్తంగా ఈ ఐదుగురు డిప్యూటీలు పేరుకే డిప్యూటీ సీఎంలు అని.. కనీసం డిప్యూటీ హోదా లేకుండా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్న మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు దక్కుతున్న ప్రాధాన్యం కూడా దక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హోం మంత్రిగా ఉన్న సుచరితకు కూడా డిప్యూటీ సీఎంల తరహాలోనే అవమానాలు జరుగుతున్నా.. ఆమె ఎలాగోలా నెట్టుకొస్తున్నారనే చెప్పాలి. ఇక డిప్యూటీ లేకుండానే తనదైన శైలిలో అనిల్ కుమార్ యాదవ్ సత్తా చాటుతున్నారన్న వాదనలూ లేకపోలేదు. తనదైన నోటి దురుసుతో అనిల్ తో పాటు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ లు డిప్యూటీ కంటే కూడా మెరుగ్గానే రాణిస్తున్నారట. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.