విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికులు చేసిన ఒక్కరోజు సమ్మె విజయవంతం అయ్యింది. వేతన ఒప్పందం అమలు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ 14 యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి వేతన ఒప్పందం అమలు చేయలేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్టు యూనియన్ నేతలు తెలిపారు. సెయిల్, ఆర్‌ఐఎన్‌ఎల్, స్టీల్ మినిస్ట్రీతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు.
అమరవీరుల త్యాగంతో..
‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రజల ఆస్తి, ఉద్యమాలతో అమరవీరుల త్యాగంతో ఉద్భవించింది. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చూడటం అన్యాయం. నవరత్న హోదా పొందిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల త్యాగం. ఆరు నెలల నుంచి దీక్షలు చేస్తున్నా కేంద్రం దిగిరాలేదు. అందుకే సమ్మెకు దిగాం, ఇది హెచ్చరిక మాత్రమే.. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్‌లో సమ్మె ఉద్ధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ కార్మికులకు అండగా ఉండి, సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించకపోవడం అన్యాయం. కార్మిక సమస్యలు, ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళన ఆగదు’’ అని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇంటక్ మినహా అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయని సీఐటీయూ నాయకులు ఆయోధ్యరామ్, ఏఐటీయూసీ నాయకులు డి.ఆదినారాయణ తెలిపారు.
Must Read ;- బలిపీఠంపై ఉన్నా.. ప్రాణ దాతగా నిలిచిన విశాఖ ఉక్కు