అమరావతి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ప్రాంత మహిళలను అవమానించారంటూ ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కామెంట్స్ వివాదం అయిన వెంటనే కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట హైదరాబాద్‌కు, తర్వాత విశాఖకు అక్కడి నుంచి ఒడిశా పారిపోయేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.
అమరావతి మహిళలను కించ పరిచిన కేసులో కృష్ణం రాజు A-1గా ఉన్నారు. ఇక ఈ కేసులో A-2గా ఉన్న సాక్షి యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు సైతం పంపారు. ఇప్పుడు కృష్ణంరాజును అరెస్టు చేశారు. వివాదం అయిన తర్వాత కూడా కృష్ణంరాజు వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయంటూ వీడియోలు రిలీజ్ చేశారు. బ్రోతల్ రెయిడ్స్ వార్తల్ని ఆధారాలుగా చూపించారు. ఆయన తీరు రెచ్చగొట్టేలా ఉండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జాతీయ మహిళాకమిషన్‌తో పాటు NHRC కూడా కేసులు నమోదు చేసింది.
విశాఖ నుంచి తీసుకు వచ్చిన తుళ్లూరు పోలీసులు ఆయనను మంగళగిరి కోర్టులో హాజరు పరచనున్నారు. కృష్ణంరాజు అనే వ్యక్తి వైసీపీతో కుమ్మక్కు అయి రాజధాని రైతులపై విపరీత వ్యాఖ్యలు చేయడం ద్వారా..ఘర్షణలు సృష్టించాలని తద్వారా వచ్చే పెట్టుబడుల్ని.. జరుగుతున్న పనుల్ని ఆపాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ కుట్రలను చేధించనున్నారు.