గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఐతే ఏ ప్రభుత్వమైనా అన్ని హామీలనూ వంద శాతం నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఐతే కొన్ని ప్రధానమైన హామీలను నెరవేరిస్తే ప్రజల మద్దతు లభిస్తుంది. ప్రతిపక్షాలకు పని తగ్గుతుంది. ఐతే ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ ఒక్కో హామీని పట్టాలెక్కిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన తల్లికి వందనం పథకాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. గతేడాది బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ హామీని కొన్ని కారణాల వల్ల అమలు చేయలేకపోయింది కూటమి సర్కార్.
ఇక ఈ విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడంతో..తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అింది. ఇవాల్టి నుంచి పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ కాబోతుంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పథకం వర్తింప జేయనున్నారు. వైసీపీ సర్కార్‌లో ఇంట్లో ఒక్కరికి మాత్రమే పథకం అందించారు. ఇప్పుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం అమలు ఈ సర్కారు వైసీపీని చావు దెబ్బ కొడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్ని రోజులు తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారంటూ జగన్ సహా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కూటమి సర్కార్‌పై సెటైర్లు వేశారు.
స్వయంగా జగనే ఓ సందర్భంలో నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన వీడియో వైరల్ అయింది. దీన్నే ఇన్ని రోజులు వైసీపీ వాళ్లు సోషల్‌మీడియాలో విపరీతంగా తిప్పారు. ఇక ఎన్నికల టైంలో నిమ్మల రామనాయుడు ఓ ఇంటికి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అన్న వీడియోను సైతం సెటైరికల్‌గా వైసీపీ వాళ్లు వాడారు. ఇప్పుడు జగన్ వీడియోను కూటమి సర్కార్ మద్దతుదారులు వినియోగిస్తున్నారు. జగన్ వీడియో పెట్టి పథకం అమలు గురించి పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు జగన్ తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లయిందంటున్నారు. ఇక పథకం అమలుతో వైసీపీ నేతల నోళ్లు మూత పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.