మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిని కూడా పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు ముందు ఏకంగా పదివేల మందికి నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించి పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి.
పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది. ఐతే గతంలో ఈ విషయంపై ఆరోపణలు వచ్చినప్పటికీ..ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు. దీంతో పేర్ని విషయంలో ఎందుకు వెనుకాడుతున్నారన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఐతే ఇటీవల మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌కు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నాని, ఆయన కుమారుడు కిట్టు అరెస్టును వాయిదా వేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఫెస్టివల్ ముగిసిపోవడంతో పోలీసులు పేర్ని చేతులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
గతంలో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైన సమయంలో అరెస్టు భయంతో పేర్ని నాని భార్య,పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన భార్యను కాపాడుకోవడానికి వెళ్లానని ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు నేరుగా ఆయనపైనే కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు రంగం సిద్ధమయింది. జైలుకెళ్తారా..పారిపోతారా అన్నది తేలియాల్సి ఉంది. నకిలీపట్టాలు ముద్రించి..తన కుమారుడ్ని కూడా ఆయన జైలుకు తీసుకెళ్తున్నారు. ఇటీవలి కాలంలో పేర్ని నాని పాత పద్దతిలో బూతులు అందుకుంటున్నారు. ఐతే పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.











