వైసీపీ జమానాలో లెక్కలేనన్ని తప్పులు జరిగాయి. వాటిని తప్పులు అనేకంటే కూడా దౌర్జన్యాలు, దుర్మార్గాలు అంటే సరిపోతుందేమో. ఎందుకంటే.. ఏపీలో కూటమి పాలన మొదలు కాగానే.. అప్పటిదాకా ఐధేళ్ల పాటు సాగిన జగన్ పాలనలో జరిగిన అక్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు వైసీపీ అక్రమాలు వెలుగు చూడని రోజంటూఇటీవలి కాలంలో ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో. నాడు సీఎంగా ఉన్న జగన్ తర్వాత స్థానం…అంటే నెంబర్ 2 పొజిషన్ తనదేనని విర్రవీగిన ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ ప్రదాన కార్యదర్శి సజ్జల రాకృష్ణారెడ్డి వెలగబెట్టిన లీలలు అన్నీఇన్నీ కావు. ఎందెందు వెతికినా… అందందు కలడు అంటూ ఇప్పుడు సజ్జల నిర్వాకారాలపై పాటలు పాడుకునే దరిద్రం దాపురించింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎలాగైతే లక్షల కోట్లను వెనకేశారో… జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సజ్జల ఆ మేర కాకపోయినా… ఓ మోస్తరుగా వెనకేసుకున్నారు. ఇదేదో సజ్జల అంటే గిట్టని వారో, వైసీపీ రాజకీయ ప్రత్యర్థులో చేస్తున్న ఆరోపణ ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు కడప జిల్లా కలెక్టర్ చేయిస్తున్న విచారణ సారాంశం ఇది.
జగన్ మాదిరే సజ్జల కూడా కడప జిల్లా వాసే. జగన్ సొంతూరు పులివెందులకు చెందిన వారే. ఈ కారణంగానే జగన్ కు సజ్జల అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. తెలుగు మీడియాకు చుక్కాని వంటి రామోజీరావు స్థాపించిన పత్రిక ఈనాడుతో పాత్రికేయ వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సజ్జల… ఉదయం పత్రిక ప్రారంభం కాగానే దానిలోకి జంప్ అయిపోయారు. ఆ తర్వాత ఎక్కడున్నారో గానీ… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే… జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. సాక్షి పేరిట జగన్ చేత మీడియా సంస్థను ఏర్పాటు చేయించి మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత జగన్ కు ఏకంగా రాజకీయ సలహాలు ఇచ్చేదాకా ఎదిగిపోయారు. అంతేనా… జగన్, ఆయన అనుచరవర్గం కూడబెట్టిన సంపదను దాచే పనిని కూడా సజ్జల నిర్విఘ్నంగా సాగించారన్న వాదనలూ లేకపోలేదు. ఇక వైసీపీ ప్రారంభం కాగానే…పార్టీలో కీలక నేతగా మారిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే… ప్రభుత్వ సలహాదారు పదవితో సూడో సీఎంగా మారిపోయి తనదైన శైలిలో చక్రం తిప్పారు.
ఇలా జగన్ అందుబాటులో లేనప్పుడు తానే సీఎం అంటూ ప్రచారం చేసుకున్న సజ్జల… మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీలో కథానాయకుడి పాత్ర పేరు అయిన అడవి దొంగను మించిన స్థాయిలో చక్రంతిప్పిన వనం తాజాగా వెలుగు చూసింది. సజ్జల తన ఇద్దరు సోదరులతో కలిసి కడప జిల్లాలో ఏకంగా అటవీ భూములను ఆక్రమించేసిన వైనంపై ఇప్పుడు అక్కడ దర్యాప్తు కొనసాగుతోంది. కడప సిటీ నుంచి చిత్తూరుకు దారి తీసే జాతీయ రహదారిని అనుకుని సజ్జల ఫ్యామిలీకి 200 ఎకరాల ప్రవేట్ ఎస్టేట్ ఉంది. ఇందులో ఏకంగా 42 ఎకరాల మేర అటవీ భూములు ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి.
సజ్జల లాంటి ప్రముఖుల మీద ఇలాంటి ఆరోపణలు రావడమేంటి అన్న భావనతో జిల్లా కలెక్టర్ వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ఎస్టేట్ లో ఉన్న 42 ఎకరాలు ఇప్పటికీ అటవీ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయట. అంతేకాకుండా ఈ భూముల్లో మామిడి, నేరేడు, టేకును సాగు జరుగుతోందట. అంతేనా… ఈ భూములతో పాటు వీటికి అనుకుని ఉన్న కాల్వలు, గుంటలను కూడా సజ్జల అండ్ కో తమ ఎస్టేట్ లో కలిపేసుకుందట. ఈ దర్యాప్తు పూర్తి అయ్యేనాటికి సజ్జల ఘనకార్యాలు ఇంకెన్ని బయటపడతాయోనన్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది.











