‘కేజీఎఫ్ చాఫ్టర్ 1’ సినిమా కన్నడలోనే కాదు, ఏ భాషలో విడుదలైతే ఆ భాషలో సంచలన విజయాన్ని సాధించింది. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారుగానీ, కన్నడ అనువాదాలను పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ జెండా ఎగరేసిన కన్నడ సినిమాలు కనుచూపు మేరలో కనిపించవు. కన్నడ నుంచి ఇక్కడి ప్రేక్షకులకు తెలిసిన హీరోలు అప్పట్లో ఉపేంద్ర .. ఇప్పట్లో సుదీప్ అంతే. ఈ ఇద్దరూ కూడా ఇక్కడి సినిమాలు చేశారు గనుక వాళ్లకి ఆ మాత్రం క్రేజ్ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ‘కేజీఎఫ్’ వచ్చింది .. యష్ అంటే ఎవరో అందరికీ తెలియజెప్పింది. ఈ సినిమా టీజర్లు .. ట్రైలర్లు ద్వారా, కన్నడ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని భారీతనమేదో ఉందనే విషయం ఇక్కడి ప్రేక్షకులకు అర్థమైంది. అంతేకాదు టేకింగ్ కూడా కొత్తగా అనిపించడంతో ఆకర్షితులయ్యారు. ఈ కారణంగానే ‘వారాహి చలన చిత్ర’ బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను 5 కోట్లకు కొనుగోలు చేసి, తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా ఇక్కడ కూడా కాసుల వర్షం కురిపించింది. దాదాపు ఆయనకి 12 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని అంటారు.
అన్ని భాషల్లోని ప్రేక్షకుల మాదిరిగానే, తెలుగు ప్రేక్షకులు కూడా ‘కేజీఎఫ్ 2’ కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. భారీ రేటుకు కొనుగోలు చేయడానికి సంసిద్ధతాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులను కూడా సాయి కొర్రపాటికే ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ‘వారాహి చలన చిత్ర’ బ్యానర్ కి గల పేరు, సాయి కొర్రపాటి తన సినిమాలకి కల్పించే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. డీల్ మాత్రం గతంలో కంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువని వినికిడి.











