నెల్లూరు ధాన్యం కొనుగోళ్ల అమ్మకాల్లో జరిగిన అక్రమాల గొడవ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. మొన్నటి వరకూ జిల్లా నేతలు పరస్పరం దూషణలకు దిగుతూ ఉంటే.., మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.., మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక మళ్లీ జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేడని, ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై విచారణకు ఆదేశించామని అన్నీ బయటకు వస్తాయన్న ప్రకటనతో జిల్లా రాజకీయం వేడెక్కింది.
బుధవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బూతులు తిట్టడంలో.., గలీజ్ మాటలు మాట్లాడటంలో కాకానికి సింహపురి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు.
తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నెల్లూరులో బూతులు తిట్టడంతో కాకానిని మించినవారు ఇంకొకరు ఉండరన్నారు. సాక్షి దినపత్రిక లో ఇటీవల వచ్చిన గింజ గింజకు దోపిడీ వార్తాకథనం పై నెల్లూరు జిల్లా బాధ్యులను ఆర్ అండ్ బి కి పిలిపించి జిల్లాలో ధాన్యం పై జరిగిన అక్రమాలను అడిగి ఉంటే కాకాని చరిత్ర మొత్తం బయట పడేదన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఎక్కడ తమగుట్టు బయటపడుతుందోనని ఆ పని చేయలేదన్నారు. కాకాని తండ్రితో సహా వారి పెద్దలు టిడిపిలో చాలాకాలం కొనసాగారని.., అందుకే ఇప్పటివరకు మౌనం వహించామన్నారు.