తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ కు ఛైర్మన్ గా వెంకటగిరి రాజావారు అయిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ పదవిలో గతంలో సినీ నటుడు, కమెడియన్ పృథ్వీ ఉన్నారు. ఆయన రాజీనామా తర్వాత.. కొన్ని నెలల విరామం అనంతరం కొత్త నియామకం జరిగింది.
వివాదాల్లో ఇరుక్కున్న పృథ్వీ
2019 ఎన్నికల సమయంలో.. దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. శ్రీకాళహస్తికి చెందిన పృథ్వీ మాత్రం అచ్చంగా జగన్ పక్షంలో ఉండిపోయారు. కేవలం జగన్ సానుభూతి పరుడిగా ఉండడం మాత్రమే కాదు.. తెలుగుదేశం మీద తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడుతూ.. పార్టీకి ఉపయోగపడ్డారు కూడా.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. ప్రతినిత్యం నుదుట కుంకుమబొట్టుతో కనిపించే పృథ్వీని- తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ.. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిలో నియమించింది. నిజానికి తిరుమలేశుని సేవలో ఇది చాలా మంచి అవకాశంగా చాలా మంది భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు సభ్యత్వానికంటె దీనికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎంపీస్థాయి వారు కూడా తిరుమలేశుని సేవలో ఈ స్థాయి పదవి కోసం ఎగబడుతుంటారు. అయితే పృథ్వీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
టీటీడీ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన ఫోన్ సంభాషణ బయటకు లీకవ్వడంతో.. పార్టీ చాలా సీరియస్ అయింది. టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి- పృథ్వీని మందలించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పృథ్వీ పదవికి రాజీనామా చేశారు. ‘తాను సచ్ఛీలుడిని అని.. ఆ విషయం నిరూపించుకుని మళ్లీ పదవిలోకి వస్తాను’ అని ఆయన ప్రతిజ్ఞలు చేశారు. నెలలు గడిచిపోయాయి గానీ.. ఆయన సచ్ఛీలత నిగ్గు తేలలేదు.
ఈలోగా.. ప్రభుత్వం కొత్త నియామకం కూడా చేపట్టేసింది. వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన సాయికృష్ణ యాచేంద్రను ఎస్వీబీసీ కొత్త ఛైర్మన్ గా నియమించింది. ఆయన సంగీత వేత్త కూడా కావడం విశేషం.