కమల్ హాసన్ నెక్స్ట్ జర్నీ ‘ఒకానొకప్పుడు…అక్కడో దెయ్యం’.. ఇదేంటా అనుకుంటున్నారా.. కమల్ హాసన్ తదుపరి చిత్రమండీ బాబూ. ‘వన్స్ అపాన్ ఏ టైమ్…దేర్ లివ్ డ్ ఏ ఘోస్ట్’ పేరుతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కమల్ హాసన్ కు ఇది 232వ చిత్రమవుతుంది. ఆయన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలన్నది ఆయన సంకల్పం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకుడు. అతను ఇంతకుముందు మానగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలు చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

కమల్ ఒక్కరేనా రజనీ కూడానా?
ఈ సినిమా ప్రకటన వెలువడగానే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో కమల్ తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించవచ్చనేది ఒక అంచనా. ఎందుకంటే తామిద్దరం కలిసి నటించాలనుకుంటున్నట్టు నటించినున్నట్లు ఓ సందర్భంలో వారు పేర్కొన్నారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటిదాకా 16 సినిమాలు వచ్చాయి. మార్చి 5నే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రజనీ ‘అన్నాత్తే’ చేస్తున్నారు.
కమల్ ‘భారతీయుడు 2’ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయంగా కలిసి కూడా అడుగులు వేస్తారని ఒక అంచనా. వారిద్దరూ కలిసి నడవడానికి ఈ సినిమా ఒక వేదిక కావచ్చని అంచనా. వీరు కలిసి ఈ సినిమాలో నటిస్తే దాదాపు 35 ఏళ్ల తర్వాత సినిమా చేసినట్లవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ అమితాబ్ తో గిరఫ్తార్ లో నటించారు. ఖైదీ సినిమా చూశాక లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని ఉందని రజనీ కూడా ఓ సందర్భంలో అన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.











