125 అడుగుల ఎత్తుతో అత్యంత భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ విగ్రహం నమూనాను బుధవారం ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించి జీవోను కూడా బుధవారం విడుదల చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భారీ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నంబర్ 2 విడుదలైంది.
మొత్తం 140 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపం లో 11 ఎకరాల స్థలం లో అంబేద్కర్ పార్కు ఏర్పాటు అవుతుంది. ఈ పార్కు లో విగ్రహం తో పాటు ,మ్యూజియం ,లైబ్రరీ కూడా ఉంటాయి. సీఎం కెసిఆర్ నిర్ణయం పట్ల దళిత ,గిరిజన ,మైనారిటీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఇది నిలుస్తుంది. హుసేన్ సాగర్ లో ఉండే బుద్ధుడి విగ్రహం ఎత్తు 18 మీటర్లు మాత్రమే. సుమారు 60 అడుగులకు పైగా ఉంటుంది. అదే అంబేద్కర్ విగ్రహం ఏకంగా 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు కానుంది. ఈ విగ్రహం వెడల్పు 45.5 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహానికి వాడే స్టీలు 791 టన్నులు ఉంటుంది. అలాగే విగ్రహానికి వాడే ఇత్తడి96 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ అంబేద్కర్ విగ్రహ నమూనాను బుధవారం ఆవిష్కరించారు.











