(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఎట్టకేలకు కంజర భట్ ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. కంజర భట్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునేందుకు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దక్షిణాది రాష్ట్రాలలో హైవేలపై దోపిడీలు చేస్తూ ఐదారు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన ముఠా గుట్టురట్టు చేశారు. దీంతో చిత్తూరు జిల్లా పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అసలేం జరిగింది
గత ఆగస్టు 25వ తేదీ సాయంత్రం తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద ఉన్న ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ నుంచి దాదాపు 16 కోట్లు రూపాయలు విలువచేసే షియోమి మొబైల్ ఫోన్లు కంటైనర్ బయలుదేరింది. కంటైనర్ లారీ నంబర్ MH 04 HD6477 కాగా డ్రైవర్ పేరు ఇర్ఫాన్. మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలోగల భివాండి కి మొబైల్ ఫోన్లు కంటైనర్ వెళ్ళాలి. జాతీయ రహదారులపై దోపిడీలు చేయడంలో చాకచక్యం ని ప్రదర్శించే కంజర భట్ ముఠా ఈ విషయాన్ని గమనించింది. అక్కడి నుంచే అదను కోసం కంటైనర్ ను మరో వాహనంలో వెంబడించింది. తమిళనాడులోని తిరుత్తణి ఆర్టీవో చెక్ పోస్ట్ దాటిన తర్వాత కంటైనర్ ఆంధ్ర లో కి ప్రవేశించింది. అక్కడ నుండి కంటైనర్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, చివరకు మొబైల్ ఫోన్స్ కంటైనర్లు ఆపారు. కంజర భట్ ముఠా లోని సభ్యులు అడ్రస్ అడిగే నెపంతో ఇర్ఫాన్ ను సమీపించారు.
అతనితో మాట్లాడుతూనే లారీ క్యాబిన్ లోకి వెళ్లి తీవ్రంగా కొట్టారు. అక్కడినుంచి కొంత దూరం కొట్టుకుంటూ తీసుకువెళ్లి వదిలేసారు. తర్వాత కంటైనర్ లోని మొబైల్ ఫోన్లలో దాదాపు సగం బాక్సులను అంటే ఏడున్నర కోట్లు విలువచేసే 7522 మొబైల్ ఫోన్లను తమ వాహనంలోకి ఎక్కించారు. మిగిలిన ఫోన్లను అక్కడే వదిలేసారు. గాయాల నుంచి తేరుకున్న ఇర్ఫాన్ కొంతసేపటికి నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా పుత్తూరు సమీపంలో కంటైనర్ ను గుర్తించారు. అయితే అయితే అందులో సగం సరుకు మాయమైంది. దీనిపై నగరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 411/2020 గా నమోదైంది.
ఛాలెంజ్ గా తీసుకున్న ఎస్పి
జాతీయ రహదారులపై దోపిడీలు మామూలుగానే జరుగుతుంటాయి. అందులో చిన్న సంఘటనలు కేసుల నమోదు వరకు వెళ్ళవు. నమోదైన కేసుల్లోనూ ఎప్పటికో గాని నేరస్థులు పట్టుబడరు. అంతేకాక మొబైల్ ఫోన్స్ దోపిడీలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న చిత్తూరు ఎస్పీ బి ఎస్ సెంథిల్ కుమార్ మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దోపిడీకి గురైన మొబైల్ ఫోన్స్ ఆచూకి ఒక బృందం, నిందితులు ఎవరెవరు ఉంటారని గుర్తించేందుకు మరో బృందం, దోపిడికి గురైన మొబైల్ ఫోన్స్ ఎవరు కొనుగోలు చేసి ఉంటారు అనే కోణంలో మూడో బృందం పని చేశాయి.
చిత్తూరు జిల్లా నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు, మరో మార్గంలో నేపాల్ సరిహద్దు వరకు జాతీయ రహదారులపై టోల్ ప్లాజా లను, సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా తానే గాటి గ్రామానికి చెందిన కంజర బట్ ముఠా సభ్యులు మొబైల్ ఫోన్లను చోరీ చేశారని గుర్తించారు. పీలేరు, నగరి ఇన్స్పెక్టర్ల సారధ్యంలో పోలీసులు తానే ఘాటి ప్రాంతంలో సాధారణ వ్యక్తుల వలె ఉంటూ ముఠా కార్యకలాపాలను పరిశీలించారు.
చివరకు మొబైల్ ఫోన్లను గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులను కలసి సహాయం కోరారు. సాధారణంగా దోపిడి లకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ముఠా సభ్యులను అత్యంత చాకచక్యంగా పట్టుకొని, గ్రామం నుంచి బయట పడ్డారు. మొబైల్ ఫోన్లు, మూడు చక్రాల వాహనాలు, దోపిడీకి వినియోగించిన లారీని స్వాధీనం చేసుకొని ముగ్గురు సభ్యులతో పోలీస్ స్టేషన్ చేరారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ట్రాన్సిస్ట్ వారెంట్ పై గురు వారం ఉదయం చిత్తూరుకు తీసుకువచ్చారు.
అభినందనలు
రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో దోపిడీలకు సంబంధించి వీరిపై కేసులు ఉన్నాయి. పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అరెస్టు చేయడం పట్ల చిత్తూరు జిల్లా పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.











