బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొద్ది రోజులుగా తరచు వార్తలలో నిలుస్తూనే ఉంది. సుశాంత్ మరణించిన తర్వాత నుండి సినీ, రాజకీయ ప్రముఖులని ఉద్ధేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర పదజాలంతో మండిపడింది. బాలీవుడ్ లో కొత్తవారికి అవకాశాలు అందకుండా ఒక వర్గం ప్రయత్నిస్తోందని ఆమె తెలిపింది. డ్రగ్స్ కేసు వ్యవహారంపై మాట్లాడుతూ బాలీవుడ్ లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువైందని, బడా బడా పేర్లు ఉన్నవారే ఈ వ్యవహారంలో ఉన్నారని ఆమె తెలిపింది.
అంతేకాకుండా ఈ అమ్మడు ఒక అడుగు ముందుకేసి ముంబైని పీవోకేగా అభివర్ణించింది. దీంతో కంగనాపై శివసేన కన్నెరజేసింది. ముంబైకి రానివ్వొద్దంటూ కూడా డిమాండ్ చేసింది. కానీ హై సెక్యూరిటీ మధ్య ముంబై వచ్చిన కంగనా వారం రోజుల పాటు ఉండి తిరిగి మనాలీ వెళ్ళింది. సామాజిక అంశాలతో పాటు సమస్యలపై తరచూ స్పందించే కంగనా రనౌత్ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటనపై స్పందించింది. హత్రస్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతిని నలుగురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ చేయడంపై కలత చెందిన కంగనా.. రేపిస్టులని బహిరంగంగా షూట్ చేయమని కోరింది.
ఈ ఘటనపై దేశం సిగ్గు పడాలి. ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూ పోతున్న సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? మన కుమార్తెలను కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు అంటూ కంగనా మండిపడింది. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అత్యాచారం చేసే నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలే రోడ్లపైకి వస్తారని ఆమె తెలిపింది. దయచేసి మన ఆడపిల్లను మనమే కాపాడుకుందాం అని కంగనా తెలిపింది. కంగనా వ్యాఖ్యలకు భారీ ఎత్తున ప్రజల నుంచి మద్దతు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోనే కాదు యావత్తు భారత్ దేశంలోనే అత్యాచారాలు పెరుగుపోతున్నాయని ప్రజ సంఘాల ప్రతినిధులు వాపోయారు. కఠిన చట్టాలు లేకపోతే ఎన్నటికీ ఈ అత్యాచారాలు ఆగవని వారు అభిప్రాయపడ్డారు.











