కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ సమీపంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న పేకాట శిబిరాలను ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నాయి. నందివాడ సమీపంలోని తరిమెశ గ్రామంలో చెరువుల మధ్యలో గట్లపై పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న సెబ్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి 30 మందిని అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల వద్ద నుంచి రూ.42 లక్షల నగదు, 20 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మురళీ అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సెబ్ అధికారులు తెలిపారు.
మంత్రి కనుసన్నల్లోనే
కృష్ణా జిల్లా మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 19 నెలులుగా తరిమెశలో పేకాట నిర్వహిస్తున్నారని మంత్రి కొడాలి అండదండలతోనే ఈ శిబిరాలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. దాడి నిర్వహించిన సెబ్ అధికారులను మంత్రి కొడాలి నాని బెదిరించారని, అందుకే పేకాట ఆడుతున్న ప్రముఖులను వదిలేసి కారు డ్రైవర్లను అరెస్టు చేశారని దేవినేని ధ్వజమెత్తారు. మంత్రి కనుసన్నల్లోనే జిల్లాలో పేకాట శిబిరాలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన నేపథ్యంలో..
కొన్ని రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్.. గుడివాడ నడిబొడ్డున మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మీద కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్టుగా.. వైసీపీలో ఉండే అనేకమంది నానిల్లో ఈ నాని ఒకడంటూ ఎద్దేవా చేశారు.
దీనికి స్పందనగా- కొడాలి నాని కూడా పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మీద పేకాట క్లబ్ ల నిర్వహణ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయితే కేవలం పవన్ కల్యాణ్ ఆరోపించిన కొన్ని రోజుల వ్యవధిలోనే చాలా పెద్ద ఎత్తున అదే నియోజకవర్గంలో పేకాట క్లబ్ లను పట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. పవన్ కల్యాణ్ నిన్న చెప్పిన మాటలే.. ఇవాళ నిజమయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మంత్రి కొడాలి నానిని ఒక రేంజిలో విమర్శిస్తున్నారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. కొడాలి నాని ప్రమేయం ఉండబట్టే.. పేకాట ఆడుతూ దొరికిన పెద్దలందరినీ వదిలేసి.. కేవలం డ్రైవర్లను అరెస్టు చేశారంటూ విమర్శలు గుప్పించారు. మరి … ఈ పేకాట వివాదం నుంచి కొడాలి నాని తన సచ్ఛీలతను ఎలా నిరూపించుకుని బయటపడతారో వేచిచూడాలి.
Also Read: ఆగని దాడులు : ఏపీలో దేవాలయాల ధ్వంస రచన!