ఈ మధ్య కాలంలో స్టార్ హీరో హీరోయిన్ల ఆలోచనలు మారిపోయాయి. స్వామికార్యం .. స్వకార్యం అన్నట్టుగా వాళ్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఇతర భాషా చిత్రాలలో అవకాశాలు వస్తే, అక్కడికి వెళ్లినప్పుడు హోటల్స్ లో మకాం పెట్టేవాళ్లు. స్టేటస్ పేరుతో హోటల్ వాళ్లని బాగుచేయడం కంటే, తమే అక్కడ ఒక ఇల్లు తీసుకుంటే ఒక స్థిరాస్తి కలిసొస్తుందనే ఆలోచన ఆ తరువాతే మొదలైంది. దాంతో బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నప్పుడు ముంబైలో .. కోలీవుడ్లో అవకాశాలు వస్తున్నప్పుడు చెన్నైలో .. అలాగే కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు బెంగుళూరులో సొంత ఇళ్లు ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టారు.
అలాగే ఇతర భాషలకి చెందిన నటీనటులు కూడా తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఇళ్లు కొనుక్కుంటున్నారు. అలా హైదరాబాద్ లో సొంత ఇళ్లు కొనుక్కున్నవారి జాబితాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా చేరిపోయినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. హైదరాబాద్ – గచ్చిబౌలి ప్రాంతంలో ఇటీవలే ఆయన ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. 5 కోట్లు చెల్లించి ఆయన ఈ ఫ్లాట్ ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ ఫ్లాట్ లోనే ఉంటాడని అంటున్నారు.
సుదీప్ కన్నడ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు కన్నడలో ‘బిగ్ బాస్’ షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుదీప్, ఆ తరువాత ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలోను మెరిశాడు. ఆ తరువాత కూడా తెలుగు నుంచి ఆయనకి చాలా అవకాశాలు వెళుతున్నాయట. ఇక కన్నడ సినిమాలు కూడా ఈ మధ్య హైదరాబాద్ లో షూటింగులు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఖరీదైన ఫ్లాట్ తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు.