ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పట్నుంచో చూస్తున్నదే. గతం నుంచి వర్తమానం వరకు చూసుకుంటే బోలెడన్ని చిత్రాలు రీమేక్ పరంపరను కొనసాగించాయి. ముఖ్యంగా తెలుగుల్లో విజయవంతమైన చిత్రాలెన్నో బాలీవుడ్లో రీమేక్ అయ్యి, అక్కడ కూడా కాసుల వర్షాన్ని కురిపించాయి. ఒకప్పుడు దాసరి, బాలచందర్, విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, తాతినేని రామారావు వంటి దర్శకులు తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేసి, అక్కడ టాలీవుడ్ సత్తాను చాటారు కూడా. ఆ తర్వాత తెలుగు చిత్రాలను హిందీలోకి రీమేక్ చేయడంలో సల్మాన్ ఖాన్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు.
ఎప్పుడైతే.. తెలుగులో విజయం సాధించిన విజయ్ దేవరకొండ `అర్జునరెడ్డి’ చిత్రం బాలీవుడ్లో `కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయ్యి, దాదాపు 280 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందో అప్పట్నుంచి తెలుగు చిత్రాలు హిందీలోకి రీమేక్ కావడం మళ్లీ ఊపందుకుంది.
ఈ వరుసలోనే విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రాల హిందీ రీమేక్ లకు బాలీవుడ్లో ఎనలేని క్రేజ్ ఏడ్పడింది. అంతేకాదు తెలుగులో విజయవంతమైన పలువురు ఇతర హీరోల చిత్రాలు సైతం హిందీలోకి రీమేక్ అవుతూ టాలీవుడ్ ఘనతను చాటుతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం హిందీలోకి రీమేక్ కాగా తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఆ ,మధ్య ఈ చిత్రం హక్కులను ప్రముఖ బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం హిందీలో నటించే హీరో కోసం ఆయన అన్వేషిస్తున్నారు.
అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆలా వైకుంఠపురంలో చిత్రం తెలుగులో కనకవర్షం కురిపించడంతో ఆ చిత్రాన్ని హిందీలో తామే రీమేక్ చేయాలని నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ అనుకుంటున్నారు. టాలీవుడ్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాదు బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్లను రాబట్టింది. ఇదే చిత్రాన్ని బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు హిందీలో నిర్మించనున్నారు. దీనికి అనీస్ బాజ్‌మీ దర్శకుడు. వరుణ్ తేజ్ పాత్రను అర్జున్ కపూర్ పోషిస్తారని చాలా రోజుల క్రితం వినిపించింది. అయితే ఈ చిత్రం తాజా విషయాలు తెలియాల్సి ఉంది.
నాని నటించిన `జెర్సీ’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వేరుగా చెప్పనక్కరలేదు. ఈ చిత్రం కూడా బాలీవుడ్లో నిర్మాణమైంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అలాగే శ్రీవిష్ణు, నివేదా థామస్,ఎం నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిన్న చిత్రం బ్రోచెవారెవరురా ఘన విజయం సాధించడంతో దానిని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ఇందులో నటిస్తున్నారు. ఈ వరుసలోనే కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం కూడా హిందీలో ‘తడాప్’ పేరుతో రీమేక్ అవుతోంది. సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరో కాగా మిలన్ లుథ్రియా దర్శకుడు.
వీటి సంగతి ఇలావుంటే తాజాగా ఛత్రపతి చిత్రం కూడా బాలీవుడ్ తెరకెక్కబోతుంది. లోగడ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనిని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నారు. దీని ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా సంఖ్యా పరంగా అనేక తెలుగు చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.