కరోనా కాలంలో సినిమాలు లేని లోటును ఓటీటీలు తీర్చాయి. గతంలో చిన్న చిత్రాలు మాత్రమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమయ్యేవి. అయితే పెద్ద హీరోలు కూడా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ బాట పట్టారు. ఈకోవలో అక్టోబర్ 2న జీ ప్లెక్స్ లో విడుదలైన చిత్రం ‘కా/పే రణసింగం’. ‘కా/పే రణసింగం’ అంటే భర్త పేరు రణసింగమ్ అని అర్థం. జ్యోతిక ‘పొన్మగల్ వందాల్’, కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తర్వాత ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రాధారులుగా నటించిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? తదితర విషయాలను చూద్దాం.
కథేంటి?
రణసింగం (విజయ్ సేతుపతి) రామనాథపురం జిల్లాలోని నీటి కరువు ఎదుర్కొనే గ్రామానికి చెందినవాడు. అతను భూగర్భ జలాల నిపుణుడు. వంశపారపర్యంగా వచ్చిన విద్య అది. అంతేకానీ గ్రౌండ్ వాటర్ కి సంబంధించి అతను ఎలాంటి సర్టిఫికెట్ పొందినవాడు కాదు. అలాగే చుట్టు ప్రక్కల గ్రామాలలో నీటి సమస్యల కోసం పోరాటం చేస్తుంటాడు. అతని పోరాట పటిమను ఇష్టపడుతుంది అరియనాచి (ఐశ్వర్య రాజేష్). పెద్దల అంగీకారంతోనే రణసింగం, అరియనాచి వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత భార్య అభ్యర్థనను అంగీకరించి దుబాయ్లో పనికి వెళ్తాడు రణసింగం. అతను పనికి వెళ్ళిన స్థలంలో జరిగిన అల్లర్లలో రణసింగం మరణించినట్లు సమాచారం అందుతుంది. రణసింగం దుబాయ్ పోలీసులతో జరిపిన అల్లర్ల వలన కాదు.. అక్కడ ఆయిల్ ప్లాంట్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ వలన చనిపోయాడనే నిజం అరియనాచి తెలుసుకుంటుంది. అయితే అరియనాచి తన భర్త రణసింగం మృతదేహాన్ని సరైనా పత్రాలు లేని కారణంగా స్వగ్రామానికి తీసుకురాలేదు. ఆమె దాని కోసం ప్రభుత్వంతో నెలల తరబడి పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో చివరకు ఆమె గెలిచిందా? లేదా? అనేది మిగిలిన కథ.
ఎలా తీశారు?
వాస్తవ సంఘటనల ఆధారంగా పి.విరుమాండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా విరుమాండికి ఇదే తొలి సినిమా. అయినా సంక్లిష్టమైన సామాజిక సమస్యను వెండితెరపై అద్భుతంగా చూపించాడు. మనుగడ కోసం విదేశాలకు వెళ్ళే వారు ప్రమాదవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని తీసుకురావడంలో సమస్యలు ఏంటి? భీమా పొందడంలో సమస్యలు ఏంటి? వంటి విషయాలను వాస్తవ ధోరణిలో చూపించాడు దర్శకుడు. కథానాయకుడు చనిపోయాడనే విషయాన్ని 30 నిమిషాల లోపే తెలియజేసినా.. సినిమా ఆద్యంతం హీరో మనకు వెండితెరపై కనిపిస్తూనే ఉంటాడు. అలా నాన్ లీనియర్ పద్ధతిలో ఈ సినిమా స్క్రీన్ ప్లే ని తీర్చిదిద్దాడు విరుమాండి. డైరెక్టర్ తీర్చిదిద్దిన సన్నివేశాలకు బలాన్ని చేకూరుస్తూ సాగే గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనసు లోతుల్ని స్పృశిస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఎన్.కె ఏకంబరం కొన్ని సన్నివేశాల్లో రామనాథపురం కరువును స్పష్టంగా చూపించాడు.
ఎవరెలా చేశారు?
మక్కల్ సెల్వన్ గా అభిమానులచే ముద్దుగా పిలవబడే విజయ్ సేతుపతి కోలీవుడ్ లో రైజింగ్ స్టార్. ఈ విలక్షణ నటుడు మిగతా నటులకు భిన్నంగా ఏడాదికి ఈజీగా ఐదారు సినిమాలు చేస్తుంటాడు. తాను పోషించే పాత్రలలో తనదైన ముద్ర వేసే విజయ్ సేతుపతి ఈ సినిమాలో రణసింగంగా జీవించాడనే చెప్పాలి. వంశపారపర్యంగా వచ్చిన భూగర్భ జలాలను కనిపెట్టే వృత్తిని కొనసాగిస్తూనే చుట్టు ప్రక్కల గ్రామాల నీటి సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసే యువకుడిగా ఆకట్టుకున్నాడు. సినిమాకి హీరో పేరుకు విజయ్ సేతుపతే అయినా.. సినిమా మొత్తాన్ని నడిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంది ఐశ్వర్య రాజేష్. స్క్రీన్ టైమ్ పరంగానూ విజయ్ సేతుపతి పాత్ర చిన్నదే. ఇక దుబాయ్ లో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాడిన మహిళగా ఐశ్వర్య అద్భుతంగా చేసింది. ఇంకా మిగతా పాత్రల విషయానికొస్తే విజయ్ సేతుపతి చెల్లెలుగా నటించిన భవానీ శ్రీ, కలెక్టర్ గా చేసిన రంగరాజ్ పాండే, సేతుపతి స్నేహితుడు మునిష్ కాంత్, ఐశ్వర్య తండ్రిగా చేసిన వేల రామ్మూర్తి.. తమ తమ పాత్రలలో పరిధి మేరకు చేశారు.
హైలైట్స్:
తమిళనాట నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాల పరిస్థితిని, పనుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుల వ్యధని సహజ ధోరణిలో చూపించిన పద్ధతి సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన ధోరణి కూడా ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఎడారిలా కనిపించే పొలంలో ఎక్కడ నీళ్లు పడతాయో కేవలం ఒక కొబ్బరికాయ మాత్రం పట్టుకుని తేల్చేసే భూగర్భ జల నిపుణుడి పాత్రలో కథానాయకుడిని చూపించిన విధానం ఎక్కుడా లాజిక్ లెస్ గా అనిపించదు. వర్షం ఎప్పుడు పడుతుంది? ఎంత మేరకు పడుతుంది? అనే విషయాలపై హీరోకి ఖచ్చితమైన అంచనా ఉన్నట్టు.. కథానాయికతో ఓ ప్రేమ సన్నివేశంలో చూపించిన సీన్.. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా పండింది. సినిమాలో మైనస్ ల గురించి ప్రస్తావించాల్సి వస్తే నిడివి అని చెప్పాలి. 2 గంటల 57 నిమిషాల పాటు సాగే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించినా సినిమాకి వచ్చే నష్టం పెద్దగా ఉండే అవకాశం లేదు.
నటీనటులు: విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్, రంగరాజ్ పాండే, మునిష్ కాంత్, వేల రామ్మూర్తి, భవాని శ్రీ
దర్శకత్వం: పి.విరుమాండి
నిర్మాత: కోటపాడి జె.రాజేష్
సంగీతం: గిబ్రాన్
విడుదల తేది: 02-10-2020
వేదిక: జీ ప్లెక్స్
ఒక్కమాటలో: ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే చిత్రం
రేటింగ్: 3.5/5
-ఎస్.డి.రాజు