తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సుమారు నెల రోజుల కిందట.. విప్లవ కవి వరవరరావు విడుదల కోసం రాసిన లేఖను ఇప్పుడు రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ డియోధర్ కు భంగపాటు తప్పలేదు. కరోనా సోకి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణాకర్ రెడ్డి ఘాటైన జవాబు ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి చాలా గౌరవప్రదంగా రాసిన ఆ లేఖలో.. డియోధర్ వక్రరాజకీయ బుద్ధిని చాలా మర్యాదగా ఎండగట్టారు.
బిజెపి నేత సునీల్ థియోధర్ ట్విట్టర్ వ్యాఖ్యలపై స్పందించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు.
81 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుపై జాలి చూపి విడుదల చేయాలని లేఖ రాశాను తప్ప, ఆయన భావజాలాన్ని సమర్ధించి కాదు అని కరుణాకర్ రెడ్డి చెప్పారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్ధించే ఉద్దేశ్యం నాకు లేదు అని వివరించారు. 46 ఏళ్ల క్రితం వరవరరావు, వెంకయ్య నాయుడు లతో కలిసి తాను కూడా ఒకే జైల్లో ఉన్న సంగతిని అరవయ్యేళ్లు దాటిన భూమన కరుణాకరరెడ్డి.. డియోధర్ కు గుర్తు చేశారు. ఆ జ్ఞాపకంతోనే వరవరరావు విడుదల కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశానంటూ ఆయన వివరించారు.
నిజానికి కరుణాకర్ రెడ్డి లేఖ రాస్తే.. డియోధర్ తన ట్వీట్ లో ఆయనను తప్పుపట్టినా సరిపోయేది. వ్యవహారానికి కాస్త మసాలా పులమదలచుకున్నట్టుగా డియోధర్.. జగన్ ను ఉద్దేశించి ట్వీట్ పెట్టారు. ప్రధాని హత్యకు జరిగిన కుట్ర ఉద్దేశ్యాలను జగన్ కు కూడా ముడిపెట్టేలా ట్వీట్ చేశారు. అయితే ఆయన వాడినట్టుగా ఘాటైన పదజాలం ఏమీ లేకుండా.. కరుణాకరరెడ్డి చాలా సుతిమెత్తగా, ఆయన ట్వీట్ కంటె ఘాటుగా లేఖ సంధించారు.
‘‘తనతో పాటు దేశంలో చాలా మంది కవులు, రచయితలు, మేధావులు వరవరరావు విడుదల కోసం లేఖలు రాశారని. అలా చేయడం హింసను సమర్ధించడం కాదని’ కూడా కరుణాకరరెడ్డి హితవు చెప్పారు. ‘‘నా వ్యక్తిగత అభిప్రాయానికి, ముఖ్యమంత్రితో ముడిపెడుతూ మీరు కామెంట్ చేయడం బాధ కలిగించింది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు.. ఏదో తోస్తే అది కాకుండా.. కాస్త తర్కబద్ధంగా మాట్లాడ్డం నేర్చుకుంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











