‘విజయశాంతి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టం. ఎన్నికల నాటి రాజకీయ సమీకరణలు బలాబలాలు అన్నీ పూర్తిగా గుర్తున్నవారికి ఆమె కాంగ్రెస్ అనే సంగతి తెలియాల్సిందే తప్ప.. వ్యవహారాల్లో ఇటీవలి కాలంలో ఎప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాల్లో మచ్చుకైనా కానరాకుండా.. విజయశాంతి.. తన రాజకీయ అస్తిత్వాన్ని తానే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. అలాంటి విజయశాంతి ఇప్పుడు తాజాగా భాజపాలో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమచారం.
విజయశాంతికి ఇది పుట్టిల్లు కింద లెక్క. ఆమె గతంలో ఇదే పార్టీలో ఉన్నారు. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆమె తెరాసలో చేరారు. కేసీఆర్ ఆమెను తన చెల్లెలుగా ప్రకటించారు. ఆ పార్టీ తరఫున ఎంపీ కూడా అయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె కూడా పార్లమెంటులో గళమెత్తి పోరాడారు. తర్వాత.. తెరాసలో ఆమె ప్రాధాన్యం తగ్గడంతో ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యం దక్కిందే తప్ప.. ఏ ఎన్నికల్లోనూ గెలవకలేకపోయారు. 2018, 2019 ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా కూడా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడింది. అప్పటినుంచి రాజకీయంగా సైలెంట్ గానే ఉన్నారు.
టాలీవుడ్ రీఎంట్రీ ఫలించలేదు
మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి ఒక కీలక భూమిక పోషించారు అప్పట్లో ఆ చిత్రం ఆమె టాలీవుడ్ రీఎంట్రీగా అందరూ కొనియాడారు. సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. దాంతో పాటు విజయశాంతి పాత్రకు కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత ఆమెను సినీ అవకాశాలు కూడా పలకరించలేదు. ప్రస్తుతానికి ఆమె రాజకీయ, సినీజీవితం స్తబ్దుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నారు.
ఏడాదినుంచి ఉన్న పుకార్లే
విజయశాంతి భాజపాలో చేరుతారనే వార్తలు సుమారు ఏడాది నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె భాజపాలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటికి ఆ పుకార్లు నిజం కాబోతున్నాయి. సెప్టెంబరు 15లోగా ఆమె అధికారికంగా భాజపాలో చేరుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణలో ఇంకా దూసుకెళ్లాలని భాజపా కష్టపడుతున్న తరుణంలో.. ఆమె పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో.. పార్టీ ఆమెకు తిరిగి అధికార పదవులు దక్కేలా చేయగలదో వేచిచూడాలి.