తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. ముద్దుగా .. బొద్దుగా కనిపిస్తూ కుర్రకారు నుంచి ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. ‘మహానటి’ సినిమాతో మరింతమంది మనసులను గెలుచుకుంది. ఆ తరువాత వరుసగా తమిళ చిత్రాలకు కమిట్ కావడంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది. తమిళ చిత్రాలను పూర్తిచేసిన ఆమె, తెలుగులో విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. కేవలం హీరో జోడీగా ఆడిపాడటానికి మాత్రమే పరిమితం కాకుండా, నటనకి అవకాశం వున్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తోంది.
ఆ నిర్ణయంలో భాగంగానే ఆమె చేసిన ‘మిస్ ఇండియా’ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించింది. కీర్తి సురేశ్ లో ప్రధానమైన ఆకర్షణ ఆమె బొద్దుగా ఉండటమే. ఈ సినిమాలో ఆమె అలా కనిపించకపోవడం మైనస్ మార్కులను తెచ్చిపెట్టింది. కథాకథనాల పరంగా ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, కొత్తదనం కోసం కీర్తి సురేశ్ ఒక మంచి ప్రయత్నం చేసిందనే చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ అభిమానులు మాత్రం ఆమె తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు.
కీర్తి సురేశ్ తదుపరి సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రంగ్ దే’ .. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలు ముస్తాబవుతున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘రంగ్ దే’ చిత్రంలో ఆమె నితిన్ జోడీగా అలరించనుంది. కామెడీ పాళ్లను ఎక్కువగా జోడించిన ఈ ప్రేమకథా చిత్రంలో, తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని కీర్తి సురేశ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఈ పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేయడాన్ని బట్టి, ఆమె చాలా విలక్షణమైన పాత్రను పోషించిందనే విషయం అర్థమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.
ఇక ఆ తరువాత సినిమాగా ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకులను పలకరించనుంది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతిగా కనిపించనుంది. టీజర్ చూసినవారు ఆమె లుక్ కి మంచి మార్కులు ఇచ్చేశారు. పాత్రకి తగిన వేషధారణ .. యాసతో కూడిన డైలాగ్ డెలివరీ .. గ్రామీణ వాతావరణానికి అలవాటుపడిన బాడీ లాంగ్వేజ్ ను కీర్తి సురేశ్ ఆవిష్కరించిన తీరు, సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఆమె కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో కీర్తి సురేశ్ కెరియర్ మళ్లీ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా కోసం మహేశ్ బాబుతో కలిసి ఆమె సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.