ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ కిటెక్స్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. బెంగళూరు ఎయిర్‌పోర్టుకు దగ్గరగా, కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో ఉన్న సత్యసాయి జిల్లాలో ఓ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కిటెక్స్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ చేనేత,జౌళీ పరిశ్రమల శాఖ మంత్రి సవిత కొచ్చిలోని కిటెక్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడి పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. అంతేకాదు..ఏపీలో టెక్స్‌టైల్ పరిశ్రమలకు ఉన్న సానుకూల వాతావరణం గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కిటెక్స్ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాట్లు చేస్తానని మంత్రి సవిత చెప్పారు. సత్యసాయి జిల్లాలో కిటెక్స్ గార్మెంట్స్ ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు మంత్రి. జిల్లాకు సమీపంలో బెంగుళూరు విమానాశ్రయంతో పాటు కృష్ణపట్నం పోర్టు, రైల్వే కనెక్టవిటీ కూడా ఉందని, దీనివల్ల ఉత్పత్తుల ఎగుమతులు ఎంతో అవకాశముందన్నారు. కర్నూల్ లో పత్తి ఎక్కువగా ఉత్పత్తవుతోందని, కిటెక్స్ గార్మెంట్స్ కావాల్సిన రా మెటీరియల్ అక్కడి నుంచే సరఫరా చేయొచ్చునని మంత్రి సవిత వెల్లడించారు. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థగా కిటెక్స్ గుర్తింపు పొందిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో దాదాపు రూ.3500 కోట్ల విలువైన పెట్టుబడి పెట్టింది కిటెక్స్. గడిచిన ఐదేళ్లలో టెక్స్‌టైల్ రంగంలో దేశంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఏప్రిల్ 2న వరంగల్‌లో యూనిట్‌ను సైతం ప్రారంభించింది. ఇక్కడ 15 మందికి ఉపాధి లభిస్తుంది. డిసెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీంతో 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.