వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్… ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయాలని ధిక్కరించారా?? ఆ పార్టీ లైన్ దాటేశారా.?? ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెనుదుమారం రేపుతున్నాయి.. ఈ కామెంట్స్ పార్టీ లైన్‌కి దూరంగా ఉన్నాయని, ఆయనకి నేడో రేపో షోకాజ్ తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఆ ఇంటర్ వ్యూలో జోగి రమేష్ ఏం అన్నారంటే.. తాము అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్‌పై చేసిన వ్యాఖ్యలు తమకు డ్యామేజ్ చేశాయని అంగీకరించారు.. వైసీపీ ఓటమికి ఇది ఒక ప్రధాన కారణమని అభిప్రాయ పడ్డారు జోగి రమేష్.. చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీ సాక్షిగా చేసిన వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు చేసిన కామెంట్స్…. ఏపీ ప్రజలలోకి బలంగా వెళ్లాయి.. వైసీపీని కూకటివేళ్లతో పెకిలించాయి.. ఈ అంశంపై తన భార్య తనని నిలదీసిందని, ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసిందని, అయితే, బాబు గారి సతీమణిపై తాను ఏమీ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. పార్టీలో కొందరు నేతలు చేసిన కామెంట్స్… భారీ నష్టం చేశాయని వివరించారు..
పార్టీలోని మరో కీలక అంశంపైనా హై కమాండ్ లైన్‌కి భిన్నంగా మాట్లాడారు మాజీ మంత్రి జోగి రమేష్.. అమరావతిపై జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు.. మూడు ముక్కలాటకి తాము ఫుల్ స్టాప్ పెడతామని, ఇక నుంచి అమరావతే సింగిల్ రాజధాని తమ విధానమని తేల్చి చెప్పారు జోగి రమేష్.. 3 రాజధానుల వలన వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని అభిప్రాయ పడ్డారు వైసీపీ సీనియర్ నేత.. ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల జోలికి వెళ్లమని,
జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపడతామని వివరించారు.. ఇక, పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పు అని కుండబద్దలు కొట్టారు జోగి రమేష్..
అయితే, జోగి కామెంట్స్‌పై రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. గతంలోనూ అమరావతిపై వైసీపీ ఇలాంటి ఫేక్ అభిప్రాయాన్నే ప్రజల ముందు వినిపించిందని, 2019లో గెలిచిన వెంటనే మూడు రాజధానులతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇటు, చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసిన సమయంలో మంత్రిగా ఉన్న ఆయన ఏం చేశారని, కనీసం నాడు ఈ తప్పులని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.. ఓట్ల కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలని ప్రజలు గుర్తిస్తారని చెబుతున్నారు..
ఇదంతా ఒక ఎత్తయితే, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, జగన్‌తో ఇదే వ్యాఖ్యలని ఒప్పించగల సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. జోగి రమేష్‌కి త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఖాయం అని అభిప్రాయ పడుతున్నారు. వాటిపై జగన్‌కి సమాధానం ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు.. మరి, ఈ ఎపిసోడ్ వైసీపీలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి..