నిన్న హనుమంతుడి చెయ్యి విరిస్తే ఏమౌతుంది అన్నారు! ఇవాళ రాముణ్ని కూడా ముగ్గులోకి లాగారు.. అక్కడితో ఆగలేదు..! పదిమందితో వెళ్లి అడిగితే అమిత్ షాను కూడా మంత్రిగా బర్తరఫ్ చేస్తారా.. అని రెచ్చిపోయారు! ఇంకా శృతిమించి మోడీ భార్యను కూడా వివాదంలోకి లాగారు. జగన్ సతీసమేతంగా రావాలని డిమాండ్ చేస్తున్న వారు.. మోడీ భార్యతో కలిసి రాముని ఆలయానికి వెళ్లాలని అడగ్గలరా? అంటూ విరుచుకుపడ్డారు. మోడీని ఎంత దారుణంగా విమర్శించే విపక్షనాయకులు కూడా సాహసించని రీతిలో.. ఆయన భార్య విషయాన్ని వివాదంలోకి లాగడం సంచలనంగా మారుతోంది.
టీడీపీ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని నిరంతరం వార్తలలో నిలుస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న కామెంట్స్ వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రాష్ట్రంలో వరుసగా అంతర్వేది రధం దగ్ధం, వెండి బొమ్మలు ఎత్తుకుపోవడం, ఆంజనేయ స్వామి చేయి విరగొట్టడం లాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. మంత్రిగా, బాధ్యతాయుతమైన బాధ్యతలో ఉన్న నాని ఈ వ్యవహారాలపై దారుణమైన కామెంట్స్ చేశారు. ఆంజనేయుని బొమ్మ విరిస్తే వచ్చిన నష్టం ఏమిటి? కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల విలువ మహా అయితే రూ. 6 లక్షలు ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆయనపై కేసులు నమోదు చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేసారు.
తీరు మార్చుకోని నాని
హిందూ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నా మంత్రి నాని తీరు మారలేదు. తనకు సంబంధం లేని ‘డిక్లరేషన్’ విషయంలో జోక్యం చేసుకున్నారు. డిక్లరేషన్ ఎత్తివేయాలంటూ కామెంట్ చేశారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. నానిని బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినబడ్డాయి. ఈ నేపథ్యంలో పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అంటూ నాని విపక్షాలను ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని హితవు పలికారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన బీజేపీ మాటలను ఎద్దేవా చేశారు. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‍కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా? అంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో కంటే మెరుగైన ఓట్లు సాధించేందుకు ప్రయత్నం చేయండంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.
నాని కొత్త భాష్యం
బ్రహ్మోత్సవాల సమయంలో ఒంటరిగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అరిష్టం అంటూ ఎదురైన ప్రశ్నకు ఆయన తనదయిన స్టైల్ లో చెప్పిన జవాబులపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ‘ప్రధాని మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? మోదీ తన భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి’ అంటూ మంత్రి కొడాలి నాని చెప్పడం బీజేపీ వర్గాలకు కూడా కోపాన్ని తెప్పించింది.
ఇప్పటికైనా నానిని జగన్ కంట్రోల్ చేయాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. లేకపోతే జగన్ సర్కార్ కు చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.











