ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. తొలిరోజు సుమారు 50 నిమిషాల పాటు అమిత్ షా ఇంట్లో ఉన్న జగన్.. బుధవారం ఉదయం సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాకకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి.
జగన్ ఢిల్లీ వెళ్లడం కాదు గానీ.. కేంద్ర ప్రభుత్వమే ఆయనను ప్రత్యేకంగా పిలిపించినట్లు తెలుస్తోంది. న్యాయవ్యవస్థ, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద పార్టీ తరఫున చేసిన వ్యాఖ్యల విషయంలో కేంద్రం సీరియస్ అయినట్లు సమాచారం. ఈ విషయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు న్యాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారని, అందుకే జగన్‌ను ఢిల్లీ రమ్మన్నారని తెలుస్తోంది.
అమిత్ షా తో భేటీలో జగన్మోహన్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ అక్రమాలు, అమరావతి భూముల గురించిన గొడవ, అంతర్వేది తదితర అంశాలను ప్రస్తావించారు. అయితే అమిత్ షా మాత్రం ఈ అంశాల గురించి జగన్ ఇచ్చిన నివేదికల్ని ఉదాసీనంగా పక్కన పెట్టేస్తూ.. అవన్నీ మామూలు విషయాలే అని తేల్చేసినట్లు సమాచారం.
న్యాయమూర్తుల మీద చేసిన ఆరోపణలకు సంబంధించి అమిత్ షా- జగన్మోహన్ రెడ్డిని సుతిమెత్తగా హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. వీరి భేటీ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, మరో న్యాయవాద, ప్రవీణ్ ప్రకాష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి అమిత్ షా తో భేటీ సమయంలో అక్కడ లేకుండా ఏపీ భవన్ కు వెళ్లిపోయారు.
ప్రధాని అపాయింట్‌మెంట్‌కు నో
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ని కూడా కలవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ప్రధానిని కూడా కలవబోతున్నట్లుగానే రెండురోజులుగా వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి- పన్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా అమిత్ షానే అడిగారని, ఆయన సుతిమెత్తగా తిరస్కరించారని తెలుస్తోంది. మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేరని, ప్రధానికి తెలియజేయవలసినది ఏమైనా ఉంటే.. పీఎంఓలోని మిశ్రాతో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం. ఆయన చెప్పిన మేరకు జగన్మోహన్ రెడ్డి వివిధ అంశాల గురించి అమిత్ షా తోను, మిశ్రాతోను మాత్రమే మాట్లాడారు.
దూకుడు తగ్గుతుందా?
హైకోర్టు న్యాయమూర్తుల మీద, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా మాటల దాడికి తెగబడుతోంది. వారికి అనుచిత ఉద్దేశ్యాలను ఆపాదిస్తోంది. న్యాయవ్యవస్థ కూడా లాలూచీ పడిపోయినట్లుగా ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించే ప్రయత్నంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు, పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు క్షేత్రస్థాయి వరకు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై తటస్థులు, విపక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తున్నా పార్టీ శ్రేణులు ఖాతరు చేయడం లేదు. మరింతగా న్యాయవ్యవస్థ మీద ఆరోపణలు చేయడంలో రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా జగన్‌ను ఢిల్లీ పిలిపించి మెత్తగా మందలించి పంపిన తర్వాత.. పార్టీ దూకుడు తగ్గుతుందా? అనే అభిప్రాయం విశ్లేషకుల్లో కలుగుతోంది. రాజకీయ విమర్శల్లో శృతి పెంచి.. న్యాయవ్యవస్థ జోలికి వెళ్లడంపై వారు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటే మంచిది.











