గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్‌ను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తేడా లేకుండా ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమంలో మునిగి పోయారు. గ్రాడ్యుయేట్‌లు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని మరీ ఎన్‌రోల్‌మెంట్ చేయిస్తున్నారు. కేటీఆర్ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు చెమటోడుస్తున్నారు. కనీస ఎన్‌రోల్‌మెంట్ చేస్తే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హులు కారని స్పష్టంగా చెప్పడంతో ముఖ్యంగా కార్పొరేటర్లు గ్రాడ్యూయేట్ల వేటలో పడ్డారు.
అధికార టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఓటు వదలకుండా ఒడిసి పట్టుకునే పనిలో పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ పార్టీ నిర్దేశించే లక్ష్యాలను చేరుకోని వారికి టికెట్ ఇచ్చేది లేదని నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది.
15మంది కార్పొరేటర్లపై నెగిటివ్ ఒపినియన్ ఉందని.. వారి పనితీరు మారక పోతే టికెట్ ఇచ్చేది లేదని పరోక్షంగా అదరికీ హెచ్చరికలు జారీచేసారని తెలుస్తోంది. టికెట్ కావాలనుకునే వారు అదిష్టానం పెట్టిన టార్గెట్ ను రీచ్ అయ్యి తీరాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో కార్పోరేటర్ కనీసం 10 వేల నుండి 20వేల వరకు ఎన్‌రోల్‌మెంట్ చేయాలని టార్గెట్ పెట్టారు.
గత నాలుగున్నర ఏళ్ళుగా ప్రజలతో టచ్‌లో ఉన్న కార్పొరేటర్లకు ఎంతమంది గ్యాడ్యుయేట్‌లు ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వారందరినీ టచ్‌లో ఉంచుకుని ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్‌ను వేగవంతం చేయాలని సూచించారు.
ఇప్పడు కార్పొరేటర్లు అంతా ఇదే పనిమీద ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాలు కూడా తగ్గుమొహం పట్టడంతో ఎన్నికల బిజీలో పడిపోయారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ఈ సారి మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేసేలా స్వయంగా కేటీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెసే కిలకం. గెలుపు ఓటములు కూడా ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్ లోనే తేలిపోయే అవకాశం ఉన్నందున అన్ని పార్టీలుఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏ పార్టీకి అందనంత మంది ని ఎన్‌రోల్‌మెంట్ చేసి నైతికంగా ఎన్నికల ముందే విజయాన్ని సాధించామన్న సంకేతం విపక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నది. మరి కేటీఆర్ ఆలోచనల మేరకు కార్పొరేటర్లు ఎన్ రోల్మెంట్ ప్రాసెస్ ను ఎంతరకు సక్సెస్ చేస్తారో చూడాలి.











