తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. వైభవం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం.. క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపి వారు చేజారకుండా చేసుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు అయిన కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి మకాం వేసి అక్కడ కొద్ది రోజులుగా రాజకీయాలు చేస్తున్నారు. ముందు పార్టీని బతికించుకోవాలంటే.. అధికారం అండగా ఉండాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీతో రహస్య పొత్తు పెట్టుకోవాలని, కమలం పార్టీ అగ్ర నేతల చల్లని చూపు తమపై ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఉంటే బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగటమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేసుల బాధ ఉండదన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకే బీజేపీతో సయోధ్యకు కేటీఆర్-హరీష్ రావులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మేలా లేదని.. ఆశించిన స్థాయిలో అటు నుండి సానుకూల స్పందన రాకపోగా, కొందరు బీజేపీ నేతలు పొత్తులు అవసరమా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అయితే, కేటీఆర్ కు ఈ మధ్య చంద్రబాబుపై అభిప్రాయం కూడా మారినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పవచ్చునో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి తెలుసుకోవాలని ఈ మధ్య మాట్లాడారు. దానిపై ఓ ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ముందు చంద్రబాబు అనేక డిమాండ్లు పెడుతున్నారని.. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకునే పని ప్రారంభించారని అన్నారు.
అలా చంద్రబాబు ఏపీకి 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) రూపాయల ఆర్థిక మద్దతు కోరినట్లుగా తెలుస్తోందంటూ బ్లూమ్‌బర్క్‌లో కథనం వచ్చింది. దీనిని మనేకా దోశి అనే జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పవచ్చో.. ఈ అంశం ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వీటినన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.