గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో ఓ కుటుంబానికి పెన్షన్ ఇచ్చి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాముల నాయక్ ఇంట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. అలా ఎన్టీఆర్ భరోసా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు సీఆర్డీఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వారి పూరి గుడిసెలో కాసేపు గడిపి వారు ఇచ్చిన టీ కూడా చంద్రబాబు తాగారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి ఓ హామీని కూడా ఇచ్చారు.
వారి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తన చిత్తశుద్దిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. ఇల్లు కావాలని ఆ నిరుపేద కుటుంబం కోరడంతో దానిపై అప్పటికప్పుడే మాట ఇచ్చిన చంద్రబాబు.. దాన్ని 12 రోజుల్లోనే ఓ కొలిక్కి తెచ్చారు. పన్నెండు రోజుల్లోనే హామీ అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల పాముల నాయక్ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో వీరి తరహాలోనే పేదల మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చంద్రబాబు ఈ పనితో నిరూపించారు.
తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని, మీరే సాయం చేయాలని జూలై 1న పాముల నాయక్ కుటుంబం చంద్రబాబును కోరగా.. 12వ తేదీ కల్లా డబ్బులు కూడా మంజూరు చేశారు. పాముల నాయక్ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడం.. వారు అందుకు సంబంధించిన పత్రాలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇంటి నిర్మాణం కోసం పాముల నాయక్ దంపతులు భూమిపూజ కూడా చేసేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ కల సాకారం అవుతుందని.. చంద్రబాబు, లోకేష్ కు పాముల నాయక్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
పాముల నాయక్ ఇంటి నిర్మాణానికి చేసిన భూమి పూజలో శుక్రవారం అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాముల నాయక్ మాట్లాడుతూ.. జూలై 1 తమ జీవితాలనే మార్చేసిందని.. చంద్రబాబు తమ ఇంట్లో అడుగు పెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో నష్టం వచ్చి, సర్వం కోల్పోయిన తమకు చంద్రబాబు ఇల్లు మంజూరు చేసినందుకు ఆయన ఆనందానికి అవధులు లేవు. సీఎం మాట ఇస్తే.. నెరవేరుస్తారని పాముల నాయక్ అన్నారు.











