చూడ్డానికి చిన్న ఘటనే అయినా… హెలికాప్టర్ లో వచ్చిన ఎన్నారై కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ విషయం ఇప్పుడు వివాదం రంగు పులుముకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోయింది.
నెల్లూరు జిల్లా అంటేనే… తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా కాంట్రాక్టర్లకు అడ్డా అని చెప్పాలి. జంబాలకు, ఆడంబరాలకు కూడా పెట్టింది పేరు.
ఆ జిల్లా రాజకీయ నేతలు కూడా బడా బడా నేతల కిందే లెక్క. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా… భారీగా జరిగిపోతూ ఉంటుంది. మొత్తంగా అంతా హైఫైగా కనిపించే నెల్లూరు జిల్లాలో బుధవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఏకంగా హెలికాప్టర్ లో ఓ ఎన్నారై కుటుంబం వచ్చేసింది.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా… హెలికాప్టర్ లో రావడమే ఆ కుటుంబం చేసిన తప్పైపోయిందా? అన్నట్లుగా సదరు కుటుంబం, హెలికాప్టర్ యాజమాన్యం, హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపైనా పోలీసులు ఏకంగా కేసులు నమోదు చేసి పారేశారు.
ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా అనంత సారగం మండలం రేవూరు గ్రామంలో బుధవారం ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు ఓ ఎన్నారై కుటుంబం కూడా వచ్చింది. అందరిలా ఏ బస్సో, లేదంటే కారో వేసుకుని వచ్చి ఉంటే సరిపోయేదేమో. అయితే కరోనా నేపథ్యమో, లేదంటే తమ డాబూ దర్పం ప్రదర్శించుకోవాలన్న భావనో తెలియదు గానీ.. ఆ ఎన్నారై కుటుంబం రేవూరుకు నేరుగా హెలికాప్టర్ లోనే వచ్చేసింది. గాల్లో వచ్చే హెలికాప్టర్ నేలకు దిగితేనే కదా… అందులోని వారు కిందకు దిగేది. అందుకే… గ్రామంలో విశాల ఆవరణ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సదరు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
అంతే… ఈ విషయం ఆ నోటా, ఈ నోటా జిల్లా ఉన్నతాధికారులకు చేరిపోయింది. హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి కదా. వివాహానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్న ఆ ఎన్నారై కుటుంబం ఉన్నతాధికారుల పర్మిషన్ విషయాన్ని మాత్రం మరిచిపోయింది. ఆ కుటుంబానికి హెలికాప్టర్ ను అద్దెకు ఇచ్చిన యాజమాన్యం కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
ఇంకేముంది… జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు… హెలికాప్టర్‌లో వచ్చిన కుటుంబం, హెలికాప్టర్ యాజమాన్యంతో పాటుగా తమకు తెలియకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపైనా కేసులు నమోదు చేసి పారేశారు. మొత్తంగా ఏదో బంధువుల ఇంట వివాహానికి హాజరయ్యేందుకు హెలికాప్టర్‌ను వాడుకున్నందుకు ఆ ఎన్నారై కుటుంబంతో పాటు వారికి హెలికాప్టర్ ను అద్దెకిచ్చిన సంస్థ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడ్డంగా బుక్కైపోయారు.











