ఒకప్పుడు హాకీ అంటే ఒక సంచలనం. ధ్యాన్‌చంద్ వంటి దిగ్గజ ఆటగాళ్లు గోల్స్ చేస్తుంటే ప్రేక్షకులు బాహ్యప్రపంచాన్ని మరిచిపోయి ఆస్వాదించేవాళ్లు. ఇప్పుడు క్రికెట్లో బ్యాట్స్‌మెన్ పరుగులు చేసినట్లు.. హాకీలో గోల్స్ చేసేవాళ్లు. మన ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టారంటే కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు నానా తంటాలు పడేవాళ్లు. ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు. స్టేడియాలు కిటకిటలాడేవి. ఇప్పటికీ హాకీని ఆ స్థాయిలో ఆదరించే అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి మన జాతీయ క్రీడ హాకీ.. ప్రపంచ కప్ నకు భారత్ ఇప్పటికే మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చింది. మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
2023లో ఒడిశాలో వరల్డ్‌కప్…
ఇప్పటికే 2018లో హాకీ ప్రపంచకప్ నకు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. మరోసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2023లో జరగనున్న హాకీ వరల్డ్‌కప్‌ను ఒడిశా ప్రభుత్వంతో సంయుక్తంగా భారత సర్కార్ నిర్వహించనుంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్ పోటీలకు వేదికలు కానున్నాయి. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.
అతిపెద్ద హాకీ స్టేడియం..
దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్ సమయానికి ఈ స్టేడియాన్ని సిద్ధం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. బిజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలోని 15 ఎకరాల్లో, 20 వేలమంది ప్రేక్షకుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్‌ను భువనేశ్వర్, రూర్కెలాలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒడిశా నుంచి దిలీప్ టిర్కీ, సునీతా లక్రా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సౌకర్యాల కోసం పరిశీలన…
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్), ఒడిశా క్రీడాశాఖ అధికారులు ఇప్పటికే రూర్కెలాలో స్టేడియం నిర్మించాలనుకుంటున్న ప్రదేశాన్ని పరిశీలించారు. టోర్నీని నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలను చూశారు. స్టేడియం నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమై, శరవేగంగా సాగుతున్నాయి.
ఇది దేశానికే ఒక బెంచ్‌మార్క్ : సీఎం
“20వేల మంది ప్రేక్షకులు కూర్చోగల సామర్థ్యముండే ఈ స్డేడియం దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంగా నిలవనుంది. సకల సౌకర్యాలతో నిర్మించనున్న ఈ స్డేడియం ప్రపంచంలోని ఇతర హాకీ స్టేడియాలకు బెంచ్ మార్క్. అలాగే, సుందర్‌ఘర్ జిల్లా దేశంలోని హాకీ ప్రతిభకు కేంద్ర బిందువు. జిల్లా నుంచి ఎందరో గొప్ప హాకీ ప్లేయర్లు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. భారత హాకీకి సుందర్‌ఘర్ అందించిన కృషికి నివాళిగా నిర్మిస్తున్న ఈ స్టేడియం ప్రపంచంలోనే ఉత్తమైనదిగా నిలుస్తుంది. ”
– నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి