అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య ఇసుక తవ్వుకునే వారి నుంచి ఎడ్ల బండికి రూ.10 వేలు కె టాక్స్ వసూలు చేస్తున్నారని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని వలీ అనే కాంట్రాక్టరు, మరొకరితో జరిపిన ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో ఉంచారని ఎమ్మెల్యే రగిలిపోయారు. వలీ అనే కాంట్రాక్టరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సమాచారం అందింది. వెంటనే మందీ మార్భలం, ఆయుధాలతో తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిలోకి చొరబడ్డారు. అక్కడ దొరికిన ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. అంతటితో ఆగకుండా కేతిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కూర్చునే సోఫాలో కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు దిగి కేతిరెడ్డి వర్గాన్ని అక్కడ నుంచి పంపించి వేశారు. తరవాత జేసీ అనుచరులు కేతిరెడ్డి కూర్చున్న సోఫాని రోడ్డపై పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటన తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జేసీ అనుచరుల దాడిలో పెద్దారెడ్డి కారు, డీఎస్పీ వాహనాలు ధ్వంసమయ్యాయి.
రగిలిపోయిన జేసీ అనుచరులు
తాడిపత్రిలో ఈ ఘటన జరిగినప్పుడు జేసీ కుటుంబీకులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ఉప ద్రవం తప్పినట్టయింది. ఘటన జరిగిన మూడు గంటల తరవాత జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. దాడి ఘటనపై ప్రభాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నేను లేనప్పుడు కొజ్జావాడు కూడా నా ఇంట్లో దూరతాడు, నా సోఫాలో కూర్చుంటాడు, దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి’ అంటూ సవాల్ విసిరాడు. జరిగిన దాడిపై మా కుటుంబీకులుగానీ, అనుచరులు గానీ ఎవ్వరూ కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వమని జేసీ ప్రభాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. పోలీసులే జరిగిన ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే ప్రత్యక్షంగా తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను రాజకీయ రొచ్చులోకి లాగే సంసృతి తమ కుటుంబంలో లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Must Read ;- వైసీపీ నేతల దౌర్జన్యం.. పోలీసుల ప్రేక్షక పాత్ర
కేతిరెడ్డి వింత వాదన
తన భార్యపై వచ్చిన ఆరోపణలపై జేసీ సోదరులతో మాట్లాడేందుకే వారి ఇంటికి వెళ్లామని, అయితే వారి అనుచరులు దాడికి తెగబడ్డారని కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. జేసీ సోదరులపై దాడి చేసే ఆలోచన తనకు లేదని, దాడి చేయాలని తాము వెళ్లి ఉంటే ఆ కథ వేరే ఉండేదని కేతిరెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పారని అందుకే శాంతియుతంగా ఉంటున్నామని కేతిరెడ్డి అంటున్నారు.
వీరి వైరం ఇప్పటిది కాదు
తాడిపత్రిలో జేసీ సోదరులకు, కేతిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మధ్య విభేదాలు ఇప్పటివి కావు. అనేక సంవత్సరాలుగా ఇరు వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉంది. గత మూడు దశాబ్దాలుగా తాడిపత్రిలో విజయబావుటా ఎగురవేసిన జేసీ సోదరులు, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి జేసీ కుటుంబాన్ని వైసీపీ పెద్దలు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జేసీ ట్రావెల్స్ వాహనాలను తప్పుడు పత్రాలతో అమ్మారంటూ వారిపై కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని రెండు నెలలు జిల్లా జైలులో పెట్టారు. బెయిల్‌పై విడుదల సమయంలో ఓ ఎస్సీ పోలీసు అధికారిని దూషించాడంటూ మరలా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. జేసీ ట్రావెల్స్ బస్సులు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తిరగకుండా చేశారు. ఏదో ఒక వంకతో రవాణా శాఖ అధికారులు తరచూ వేధింపులకు దిగడంతో, వీటిని భరించలేక జేసీ ట్రావెల్స్‌ను దాదాపుగా నిలిపి వేశారు. అంతేకాదు తాడిపత్రి సమీపంలో సిమెంటు ఫ్యాక్టరీ కోసం జేసీ సోదరులు తీసుకున్న 600 ఎకరాల గనుల భూమిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూమిలో అక్రమ మైనింగ్ చేశారని మరికొన్ని కేసులు వారిపై మోపారు. అయినా జేసీ సోదరులు ఎక్కడా తగ్గలేదు. జేసీ సోదరులను టీడీపీ నుంచి వైసీపీలో చేరాలంటూ, అనేక ఒత్తిడులు తీసుకు వచ్చినా వారు లొంగలేదు. దీంతో జేసీ సోదరులపై ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతున్నారని తాజా ఘటనతో అనుమానించాల్సి వస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు.
Also Read ‘- అనంత బ్యాంకు ఉద్యోగిని హత్య కేసులో విస్తుపోయే నిజాలు