తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ , పుదుశ్చేరిలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. తాజాగా ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో అదే విషయం వెల్లడైంది. ఈ ఫలితాలను సదరు సంస్థ వెల్లడించింది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో టైమ్స్ నౌ-సీ ఓటర్ నిర్వహించిన సంయుక్త సర్వేలో పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి మమత బెనర్జీ మధ్య హోరాహోరీ పోరు ఉందని, రెండు శాతం ఓట్లు బీజేపీకి ఎక్కువగా వస్తాయని తేలింది. ఇక తాజాగా ఏబీపీ –సీ ఓటర్ సంస్థ సర్వే విషయానికి వస్తే.. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ మమతా బెనర్జీ సర్కారు రానుండగా కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష కూటమి, అసోంలో బీజేపీ అధికారంలోకి రానుందని తేల్చింది. ఇటీవలి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుశ్చేరిలో బీజేపీకి ఛాన్స్ ఉందని, అదే సమయంలో తమిళనాడుతో ప్రస్తుతం ఉన్న AIADMK-BJP కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందని, అక్కడ కాంగ్రెస్ –DMK కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చింది. ఒకవేళ ఆ సర్వే ప్రకారమే ఫలితాలు వస్తే బీజేపీ 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుశ్చేరిలో అధికారంలోకి వస్తుంది. 234 స్థానాలున్న తమిళనాడులో ఆ పార్టీ కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే బీజేపీకి నష్టం లేదు కాని..ప్రాధాన్యం ప్రకారం దక్షిణాదిలో కీలక రాష్ట్రాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే సర్వే ఒక అంచనా మాత్రమే. మే2న ఫలితాలు రానున్నాయి.
సర్వే వివరాలు ఇలా..
పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ TMC (AITC) 148-164 స్థానాలు సాధిస్తుందని, బీజపీ 92-108 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ 31-39సీట్లు సాధిస్తుందని ఆ సర్వే వెల్లడించింది. పర్సెంటేజీ పరంగా చూస్తేTMC 43శాతం, బీజేపీ 38శాతం, కాంగ్రెస్ 13శాతం సీట్లు సాధిస్తాయని తేల్చింది. కేరళలో ఎల్ డీఎఫ్ 83-91, యూడీఎఫ్ 47-55, బీజేపీ, స్వతంత్రులు గరిష్టంగా 2 స్థానాల చొప్పునసాధిస్తారని తేల్చింది. తమిళనాడులో ఈ సారి అధికారం మారుతుందని సర్వే తేల్చింది. డీఎంకే, కాంగ్రెస్ కూటమికి 154-162స్థానాలు, అధికార AIADMK, BJP కూటమికి 58-66స్థానాలు, ఇతరులు 8-20స్థానాలు గెలుచుకోవచ్చని తేల్చగా అసోంలో బీజేపీ కూటమి 68-76, కాంగ్రెస్ కూటమి 43-51, ఇతరులు 5-10స్థానాలు, పుదుశ్చేరిలో బీజేపీ కూటమి 17-21, కాంగ్రెస్ కూటమి 8-12, ఇతరులు 1-3స్థానాలు గెలుచుకోవచ్చని తేల్చింది.
ప్లస్ పాయింట్‌గా మారిన సీఎం అభ్యర్థి
కాగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ , కేరళ, అసోంలో సీఎం అభ్యర్థులపై చాలా వరకు క్లారిటీ ఉంది. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి నుంచి స్టాలిన్ పేరు దాదాపు ఖరారు కాగా బీజేపీ, AIADMKనుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తమిళనాడులో సీఎంగా ఉన్న పళనిస్వామిని కొనసాగిస్తారా, శశికళ ప్రభావం ఏంటనే విషయం తేలలేదు. ఇది బీజేపీకి మైనస్‌గా మారనుందని తెలుస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్, వామపక్షాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి లేదు. TMC నుంచి మమత బెనర్జీ కన్‌ఫర్మ్ కాగా బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ పేరుతోపాటు స్వామికృపాకరానంద మహరాజ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మమత వ్యతిరేక ఓటు బ్యాంక్, మోదీ ఛరిష్మా, కేంద్రంలో అధికారం అంశాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీకి కొంత మైనస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 54.5 శాతం మంది ప్రజలు మమత బెనర్జీ వైపే ఉన్నారని, బీజేపీపై కేవలం 24శాతం మంది మాత్రమే మొగ్గుచూపారని సర్వే చెబుతోంది.
కేరళలో..
కేరళలో ఎల్డీఎఫ్ సీనియర్ నేత, సీఎం పినరయి విజయన్ వైపు 38శాతం మంది మొగ్గు చూపగా, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఊమెన్ చాందీవైపు 27శాతం మంది ఉన్నారని సర్వే తేల్చింది. అంటే సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో బీజేపీకి కొంత నష్టం కలగనుందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. మొత్తం మీద గతంలో 2014 ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు ఓ సవాలు విసిరింది. మా వైపు మోదీ.. మరి మీ వైపు ఎవరు అని కాంగ్రెస్ కు సవాలు విసిరింది. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతిపక్షాలు అలాంటి సవాలునే విసురుతున్నాయని చెప్పవచ్చు.