ఎన్నికల వ్యూహకర్తగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయన పంజాబ్ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సిద్ధం అవుతున్నారు. పంజాబ్‌లో 2022 లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఆమేరకు పంజాబ్ కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో ప్రశాంత్ కిషోర్‌కు కేబినెట్ హోదా దక్కింది. అయితే, ప్రశాంత్ కిషోర్‌కు అందుతున్న పారితోషికం ఎంతో తెలుసా అక్షరాలా ఒక్క రూపాయి. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! ఎందుకంటే నెల వేతనంగా ఒక్క రూపాయి ఇవ్వనున్నట్లుగా జీవో కూడా జారీ చేస్తున్నారు. అయితే వేతనం తక్కువే అయినప్పటికీ ఆయనకు సిబ్బందితో పాటుగా పర్సనల్ సెక్రటరీ , అధికారిక నివాసం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వ్యూహకర్తగా ..
2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రశాంత్ ఎన్నికల వ్యూహమే కారణమన్నప్రచారం ఉంది. ఆ తర్వాత వారితో పొసగకపోవడంతో భారతీయ జనతా పార్టీకి దూరమయ్యారు పీకే. అప్పట్లో బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో సైతం జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అక్కడి ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు.











