కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేయూత అందించేందుకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కో కల సాకారం అవుతోంది. ఇప్పటికే రాజధానికి ప్రపంచబ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి ఆమోదం తెలిపింది. మరోవైపు, పోలవరం పనుల కోసం అడ్వాన్సు రూపంలో రూ.2,800 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు విభజన హామీల్లో ముఖ్యమైనది విశాఖపట్నం రైల్వే జోన్. దీని హెడ్ ఆఫీసు నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన జరగనుంది. ఈ విషయాన్ని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ తర్వాత ఈ విషయాన్ని ఎన్డీయే కూటమి ఎంపీలతో చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చి.. సీఎం చంద్రబాబు వెంటనే మోదీని కలిశారు. సుమారు 1.15 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ – 2047 విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ఆంధ్రా-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో చెప్పారు.
ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ఆంధ్రప్రదేశ్‌లో మరింత మందికి విస్తరించేందుకు వీలుగా చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయడానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా కలిశారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఐటీ, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుపైనా సమాలోచనలు జరిపారు. చంద్రబాబు ప్రతిపాదనలన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న.. కొత్త రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డిసెంబరుకల్లా కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.