సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చింది… విజయవాడ ఇంద్రకీలాద్రి వెండి సింహాలు మాయం కావడం కూడా వెంకి చావుకే వచ్చింది. అదే వెంకట్ అనే సబ్ కాంట్రాక్టర్ కి వచ్చింది. వెండి రథం సింహాలు మాయం కావడం వెనుక వాటికి పాలిష్ కాంట్రాక్ట్ పొందిన వెంకట్ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగింది.
గత మూడు రోజులుగా విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కనకదుర్గమ్మ ఆలయంలోని వెండి రథానికి ఉన్న సింహాలు మాయం కావడంపైనే చర్చ జరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వచ్చి ఏమి సేతురా వెల్లంపల్లి.. ఏమీ సేతు… అంటూ ఆయన దగ్గరే ఆగుతోంది.
ఇంద్రకీలాద్రిలో ఉన్న ఈ వెండి రథానికి నెలకు 47 వేల రూపాయలు తీసుకుని శర్వాణి అనే ఓ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. నిజానికి ఆ సంస్థే పాలిషింగ్ చేయాలి. దేవాలయ రికార్డుల్లో కూడా అధికారికంగా ఆ సంస్థ పేరు ఉంటుంది. అయితే ఆ సంస్థకి ఖాళీ లేకో, మరో కారణమో కాని ఈ కాంట్రాక్ట్ ను వెంకట్ అనే ఆసామికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది.
ఆ కాంట్రాక్టర్ ఈ సంవత్సరం మార్చి నెలలో ఉగాది ముందు రథానికి పాలిష్ చేశారు. ఈ కేసు మలుపులు తిరుగుతున్న సమయంలో పోలీసులు బంగారం, వెండి నాణ్యతను, దాని ధరను నిర్ణయించే అప్రైజర్ ని విచారిస్తున్నారు. అయితే అప్రయిజర్ ని విచారించడానికి ముందు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వెంకట్ తాను మార్చిలో పాలిష్ చేసే సమయంలో వెండి విగ్రహాలు చూసానంటూ అప్రయిజర్ కి చెప్పారు. ఇదే విషయాన్ని అప్రయిజర్ తనను విచారించిన పోలీసులకు చెప్పారు.
ఎవరి హయాంలో జరిగిందో తేలినట్లేనా…
వెండి సింహాలు మాయం కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై నిప్పులు చెరుక్కుంటున్నారు. ఇది మీ హయాంలోనే జరిగిందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వాళ్లూ, కాదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అప్రయిజర్ అసలు విషయం చెప్పడంతో వెండి సింహాలు ఎవరి జమాలో మాయం అయ్యాయో తేలిపోయింది.
రెండు రోజుల వరకూ మీ హయాంలోనే అన్న అధికార పార్టీ ఇప్పడు ఏం మాట్లాడుతోందని ప్రతిపక్షం వేచి చూస్తోంది. ఇక మరో విషయం సబ్ కాంట్రాక్టర్ వెంకట్ పోలీసులకు విచారణలో ఏం చెబుతాడు అనేది చాలా కీలకంగా మారింది. ఇంత కీలకం కనుకే సింహాల్లాగే వెంకట్ కూడా మాయం. అన్నట్లు ఆయన సెల్ ఫోన్ కూడా మాయం.
నాలుగో సింహమే మిగిలింది…
రథానికి నాలుగు వైపులా ఉన్న నాలుగు సింహాలలో మూడు మిస్ అయ్యాయి. ఒక్క సింహం మిగిలింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్న నాలుగో సింహం విజయవాడ పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే. కనిపించని నాలుగో సింహమేరా పోలీసు అనే డైలాగ్ ఇంద్రకీలాద్రి రథం విషయంలో మారిపోయింది. మూడు సింహాలు కనిపించకుండా పోయినా… కనిపిస్తున్న నాలుగో సింహమేరా మిగిలింది.











