బ్రహ్మోత్సవం… ఈ పేరు వింటేనే భక్తజనుల గుండెలు ఉప్పొంగుతాయి. ఈ ఉత్సవాన్ని కనులారా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను మనం చూడబోతున్నాం. ఈనెల 19 నుంచి అంటే రేపు శనివారం నుంచి 27 వ తేదీ వరకు, ఆ తర్వాత అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగబోతున్నాయి. అటు తిరుపతిలో శ్రీవేంకేశ్వర స్వామివారు, ఇటు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను మనం చూడబోతున్నాం. మరి ఆ భక్తజన ప్రవాహం ఈసారి ఉంటుందో ఉండదో అనుమానమే. ఈసారి కేవలం టీవీలకే పరిమితమై ఈ బ్రహ్మోత్సవాలను తిలకించే అవకాశం ఎక్కువగా ఉంది.
అధికమాసం అంటే ఏమిటి?
చాంద్రమానం ప్రకారం మూడేళ్ళకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలనూ , నిజ ఆశ్వీజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అయితే ఈసారి అధికమాసం ఆశ్వీజమాసంలో వచ్చింది. కాబట్టి వార్షిక బ్రహ్మోత్సవాలను అధిక ఆశ్వీజంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికీ పెద్ద తేడాలేదు. వైఖానస ఆగమం ప్రకారం మొదటి బ్రహ్మోత్సవాల కన్నా రెండో బ్రహ్మోత్సవాలను కాస్త తక్కువ స్థాయిలో, కొద్దిపాటి మార్పులతో నిర్వహిస్తారు.
మనకు ఏ పండుగా ఒకే రోజు రాదు. దీనికి కారణం అధిక మాసమే. మన పంచాంగాల ప్రకారం సౌరమాన మాసాలకూ, చంద్రమాన మాసాలకూ పదకొండుంపావు రోజులు తేడా ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. అది నెలలకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా అధికమాసాలలో శుభకార్యాలు చేయరు. కానీ దేవుళ్లకు సంబంధించిన పూజాకార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయి. అధిక మాసాలు ఎప్పుడూ చైత్రం నుంచి ఆశ్వీజ మాసం మధ్యలోనే వస్తుంటాయి.
ఏమిటి ఈ ఉత్సవాల ప్రత్యేకత?
తిరుమలలో వేంకటాద్రిపై తను వెలసిన తొలినాళ్లో వేంకటేశ్వరుడు బ్రహ్మదేవుడిని పిలిచి తనకు విశేషమైన ఉత్సవాలు నిర్వహించాలని కోరినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వీజమాసంలో శ్రవణా నక్షత్రం వచ్చే రోజు వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మ ఈ ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందంటారు. ఈసారి అధికమాసం వల్ల రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వస్తోంది.
తిరుమలలో వందలాది ఏళ్లుగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పాలన ఎవరి చేతుల్లో ఉన్నా బ్రహ్మోత్సవాలు మాత్రం వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. పూర్వం నెలకు ఒకసారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారట. ఆ తర్వాత అది ఏడాదికి ఒకసారిగా మారింది. అధిక మాసం వస్తే మాత్రం రెండు సార్లు తప్పదు. కరోనా వైరస్ కారణంగా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించారు. తిరుమల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారట.











