ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా గురువారమే పదవీ బాధ్యతలు చేపట్టిన ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం… గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడు జారీ చేసి వాయిదా వేసిన నోటిఫికేషన్ నే కొనసాగిస్తున్నట్లుగా కూడా తాజా నోటిఫికేషన్ లో పేర్కొనడం గమనార్హం. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జడ్సీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వాటిలో వేటికైనా రీపోలింగ్ అవసరమని భావిస్తే… వాటికి 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే 10న ఓట్ల లెక్కింపు చేపట్టి… తుది ఫలితాలను విడుదల చేస్తారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ గురువారం (ఏప్రిల్1న) జారీ చేయగా… ఈ నెల 10లోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది.
ఇదిలా ఉంటే… తాజా నోటిఫికేషన్ కొత్తదేమీ కాదని, గతంలో నిలిచిపోయిన నోటిఫికేషన్ కే కొనసాగింపు అన్న అంశాన్ని కూడా కొత్త ఎస్ఈసీ పేర్కొనడం గమనార్హం. పాత నోటిఫికేషన్ సమయంలోనే చాలా స్థానాలను అధికార వైసీపీ తన కంబడలంతో ఏకగ్రీవం చేసుకున్న సంగతి తెలిసిందే. పాత నోటిఫికేషన్ కే కొనసాగింపుగా ఇప్పుడు జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం… గతంలో ఏకగ్రీవమైన స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరపరు. ఏకగ్రీవం కాని స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా తనకు అనుకూలమైన నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్న వైసీపీ సర్కారు… ఆ వెంటనే తాను ఏకగ్రీవం చేసుకున్న స్థానాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తగా ప్రీప్లాన్డ్ గానే పాత నోటిఫికేషన్ కు కొనసాగింపుగా తాజా నోటిఫికేషన్ జారీ చేయించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాత నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ… ఈ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం.
Also Read:బెదిరింపుల ఏకగ్రీవాలతో ఎన్నికలా?.. కొత్త నోటిఫికేషన్ కావాల్సిందే