కాళిదాసు రచనల్లో ‘అభిఙ్ఞాన శాకుంతలం’ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకంటే ఒక స్త్రీ జీవితం ప్రకృతితో ఎంతగా పెనవేసుకుపోయి ఉంటుందనడానికి నిదర్శనంగా ఈ కావ్యం కనిపిస్తుంది. మేనక – విశ్వామిత్రుడు కలయిక కారణంగా ఓ ఆడ శిశువు జన్మిస్తుంది. శకుంతాలు (పక్షులు) వలన పోషించబడుతున్న ఆ శిశువును చూసిన ‘కణ్వమహర్షి’ ఆమెకి ‘శకుంతల’ అనే నామకరణం చేస్తాడు. ఆశ్రమ వాతావరణంలోనే ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. ఇప్పుడు ఈ కథనే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ టైటిల్ తో రూపొందిస్తున్నాడు.

కాళిదాసు వర్ణన ప్రకారం శకుంతల మంచి పొడగరి .. నాజూకు సుందరి. అందువలన ఈ సినిమాకి ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది. కానీ ఆ తరువాత సమంత పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే ఖరారు చేసినట్టుగా గుణశేఖర్ ప్రకటించాడు కూడా. అప్పటి నుంచి ‘దుష్యంతుడు’ ఎవరు? అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. కథ ప్రకారం ‘దుష్యంతుడు’ హస్తినాపురానికి రాజు. శకుంతలను తొలిచూపులోనే మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత దూర్వాస మహర్షి శాపం వలన ఆమెను మరిచిపోతాడు.
ఈ పాత్ర కోసం మలయాళ నటుడు ‘దేవ్ మోహన్’ పేరును గుణశేఖర్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆయన పేరు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. కానీ గుణశేఖర్ మాత్రం .. తన కంటే ముందే ‘దుష్యంతుడు’ ఎవరనేది ఫిక్స్ చేయవద్దని అంటున్నాడు. కానీ దేవ్ మోహన్ పేరు మాత్రం జోరుగానే షికారు చేస్తోంది. మలయాళ సినిమా ‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న ఈ హీరో హ్యాండ్ సమ్ గా , మ్యాన్లీగా ఉంటాడు కాబట్టి.. గుణశేఖర్ అతడ్నే దుష్యుంతుడు పాత్రకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఒక వైపున ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మరో వైపున ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ నిర్మాణం కూడా జోరుగా జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=LOh5SN-ftmc











