విజయ్ అంటే ఒక ప్రభంజనం .. విజయ్ అంటే ఒక సంచలనం .. ఇది ఆయన అభిమానులు చెప్పుకునే మాట. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే వాళ్లకి పండగే .. ఆ సినిమా థియేటర్లో ఉన్నన్నాళ్లూ సందడే. విజయ్ 64వ సినిమాగా వచ్చిన ‘మాస్టర్’ కాసుల వర్షం కురిపిస్తుందని వాళ్లు ఎంతో నమ్మకంగా చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతుందా? అని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల మాటే నిజమైంది. తమిళనాట మాత్రమే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
‘మాస్టర్’ థియేటర్లకు రాక ముందు, కరోనా ప్రభావం వలన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వైపు నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి కూడా. కానీ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో నిర్మాతలు అందుకు అంగీకరించలేదు. విజయ్ రేంజ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఆడియన్స్ కి పూర్తిస్థాయి సంతృప్తి కలగదని వాళ్లు భావించారు. అందువలన వాళ్లు అందుకు ఒప్పుకోలేదనే టాక్ బయటికి వచ్చింది.
ఇక సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. మాస్ ఏరియాల్లో ఈ సినిమా జోరు మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన భారీ డీల్ ను పూర్తిచేసింది. ‘అమెజాన్ ప్రైమ్’ వారు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం వాళ్లు 60 కోట్ల వరకూ చెల్లించినట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’ లో చూడొచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై ఈ ‘మాస్టర్’ ఏ స్థాయిలో రచ్చ చేస్తాడో చూడాలి మరి!