మంచు వారి ఇంట సస్పెన్స్ ల పంట దాగుందా ? మంచు మోహన్ బాబు వారసుల్లో ఒకడైన మంచు మనోజ్ రీల్ లైఫ్ వదిలి రియల్ లైఫ్ హీరో కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడా ? స్ట్రాంగ్ గా తిరిగివస్తాను అంటూ మనోజ్ చేసిన ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటి ? వివాదాలకు కేరాఫ్ గా ఉండే మంచు ఫ్యామిలీ మళ్ళీ హాట్ టాపిక్ గా మారడానికి కారణాలు ఇవేనా ? మంచు కుటుంబం పై సినీ , రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ఏంటి ?
మంచు కుటుంబం అంటేనే సంచలనాలకు మరి ముఖ్యంగా వివాదాలకు కేరాఫ్ గా చెప్పుకుంటారు. అది సినీ పరిశ్రమ అయినా, రాజకీయ క్షేత్రం అయినా.. వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదనేది కొందరి అభిప్రాయం. అదేదో సినిమాలో మంచు మోహన్ బాబు చెప్పిన డైలాగ్ “నా రూటే సపరేటు” అనే ఫార్ములా ఆ కుటుంబం మొత్తం ఫాలో అయిపోతున్నట్లే కనిపిస్తుంటుంది. అలాంటి మంచు ఫ్యామిలీ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కి హాట్ టాపిక్ గా మారింది.
మంచు వారి చిన్న వారసుడు మనోజ్ ఈసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా, మనోజ్ చర్య దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లు అయ్యింది. గత కొంత కాలంగా మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భవమ్మా మౌనికా రెడ్డి వివాహం జరగబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లోని ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి రావడం, పక్కపక్కనే నిలుచుని పూజలు చేయడంతో ఇది నిజమే అనే అభిప్రాయం మరింత బలపడింది.
తన పెళ్లి అంశం పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం మనోజ్ నో కామెంట్ అనేశాడు. తన జీవితానికి సంబంధించిన మంచి విషయం గురించి , సినిమా , రాజకీయ ఆరంగేట్రం వంటి అంశాలలో భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే బహిర్గతం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే మనోజ్.. ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ పెద్దగా సినిమాల్లో కూడా నటించలేదు. మొన్నామధ్య జరిగిన మా ఎన్నికల సమయంలో అన్న మంచు విష్ణు కోసం మనోజ్ తీవ్రంగా శ్రమించాడు. అది మినహా ఈ మూడేళ్ళలో మనోజ్ ఎక్కడా పెద్దగా కనిపించింది లేదు. తాజాగా మౌనిక రెడ్డి తో కలిసి మనోజ్ దర్శనమివ్వడం పై భిన్నాభిప్రాయాలే వ్యక్తంఅవుతున్నాయి.
ఇక భూమా మౌనిక రెడ్డి సైతం బెంగుళూరు కు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహమాడి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. మౌనిక, గణేష్ రెడ్డి లకు 5 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. విడాకుల అనంతరం మౌనిక హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
కాగా, ప్రస్తుతం మనోజ్, మౌనిక లు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుండగా ,దీన్ని ఇరువురు ఖండించకపోవడంతో ఇది నిజమే అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఒకవైపు మౌనిక రెడ్డి తో వివాహం అనే ప్రచారం జోరుగా సాగుతుండగానే.. మరోవైపు మనోజ్ తన సినీ కెరీర్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడాని, మౌనిక రెడ్డి తో వివాహం తరువాత దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సినీ, రాజకీయ వర్గాలలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మనోజ్ నంధ్యాల నుంచి పోటీ చేయబోతున్నాడు అని కొందరు, లేదు స్వస్థలం చిత్తూరు అయితేనే బాగుంటుందని మరికొందరు లెక్కలేయడం కూడా మొదలెట్టేశారట.ఇక మనోజ్ సైతం తాను స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను అంటూ ట్విటర్ వేదికగా ఓ ప్రకటన చేయడంతో ఆయన అభిమానులు కూడా మనోజ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని అనుకుంటున్నారట.
మరి మంచు వారి వారాసుడు శుభవార్తే చెబుతాడా ? ట్విస్ట్ నే ఇస్తాడా చూడాలి మరి.