గత ఐదేళ్లుగా పడిన కష్టం.. ఏపీ ప్రజలకు మంచి రోజులు తీసుకురావడం కోసం ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు.. గత ప్రభుత్వ బెదిరింపులకు ఏ రోజూ వెన్ను చూపలేదు. ఎండ, వాన అనే తేడా లేకుండా వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల వారిని కలిశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. మొత్తానికి రాక్షస పాలనను గద్దె దింపగలిగారు. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి నారా లోకేశ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు.
అధికారంలోకి భారీ మెజారిటీతో వచ్చి ప్రస్తుతం నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐదేళ్లుగా చాలా కష్టపడ్డాం కదా.. ఇప్పుడు కొన్నాళ్లు రెస్ట్ తీసుకుందాం అనే ఆలోచన లోకేశ్ లో ఏ మాత్రం లేదు. నిత్యం తీరిక లేకుండానే గడుపుతున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా ఎప్పుడూ ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాల దిశగానే లోకేశ్ దినచర్య ఉంటోంది. అలాగే ఉదయం 8 గంటలు అయితే చాలు.. మంగళగిరిలోని లోకేశ్ నివాసం వద్ద కోలాహల వాతావరణం రోజూ ఉంటోంది. ఉదయం 6 నుంచే జనాలు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. వారంలో అన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటోంది. ఇదంతా నారా లోకేశ్ నిర్వహించే ప్రజాదర్బార్ కోసం. తన ఇంటికి సమస్యలతో వచ్చే వారికి ధైర్యాన్ని నింపి పంపుతున్నారు.. లోకేశ్.
ప్రజా దర్బార్ ను నారా లోకేశ్ ఒక దినచర్యగా మార్చుకున్నారు. చంద్రబాబు కుమారుడిగా.. మంగళగిరి ఎమ్మెల్యేగా.. మంత్రిగా వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెడుతున్నారు. ఆయన.. తాను చేస్తున్న పనిని లోప్రొఫైల్ గా ఉంచుకోవటం గమనార్హం. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నారా లోకేశ్ తాను రోజూ నిర్వహించే ప్రజా దర్బార్ గురించి ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు. ప్రభుత్వ ఏర్పాటు మొదలు.. రోజూ ప్రజాదర్బార్ ఉంటోంది. ఎప్పుడూ లోప్రొఫైల్ మొయింటైన్ చేసుకోవటం, కష్టంలో ఉన్న వారు ఎవరైనా సరే.. గుట్టుచప్పుడు కాకుండా సమస్యని పరిష్కరించేయడం మాత్రమే లోకేశ్ కు తెలుసని అక్కడికి వచ్చిన ప్రజలు చెబుతున్నారు.
ఇతర పార్టీల మాదిరిగా ప్రచార యావ లేకపోవడం పట్ల లోకేశ్ ను ప్రజలు అభినందిస్తున్నారు. పైగా తనను కలిసేందుకు ప్రతి రోజు ఎదురుచూస్తుంటానన్న మెసేజ్ ను తన ప్రజాదర్బార్ ద్వారా పంపుతున్నారు. ప్రజా దర్బార్ లో క్యూ పద్దతిలో ప్రజలను లోపలకు పంపటం.. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో వారిని కూర్చోబెడుతున్నారు. వారి వద్దకే నారా లోకేశ్ వెళ్తూ తనదైన ప్రత్యేకత, ప్రజలపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుతున్నారు. కచ్చితంగా ఉదయం తన మంగళగిరి ప్రజలకు సమయం ఇస్తూనే.. మిగతా రోజంతా మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా తన శాఖల్లోని విషయాలను చక్కబెడుతున్నారు. ప్రజాదర్బార్ తో లోకేశ్ సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్నారనే మాట బలంగా వినిపిస్తోంది.