జగన్ జమానాలో మొన్నటిదాకా ప్రభుత్వ సలహాదారు పదవిలో డాబూదర్పం ఒలకబోసిన వైసీపీ ప్రదాన కార్యదకర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు తారుమారైందనే చెప్పాలి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా*డి, బాలీవుడ్ నటి జెత్వానీ కేసులో కీలక పాత్ర, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిన వ్యవహారాలకు సంబందించి ఇప్పటికే సజ్జలపై పలు ఆరోపణలు వినిపించాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల పాత్ర ఉందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రాష్ట్ర పోలీసు శాఖ సజ్జల విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ సజ్జలకు పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
వాస్తవానికి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా*డి కేసును మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కేసు బదిలీకి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరి రూరల్ పోలీసులు సజ్జలకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, గురువారం ఉదయం 10.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని సదరు నోటీసుల్లో సజ్జలను కోరారు.
ఈ విచారణకు సజ్జల హాజరవుతారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే… ఈ కేసు విచారణకు హాజరయ్యే సజ్జలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ లు మంగళగిరి పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతున్నారు.ఈ లెక్కన సజ్జల కూడా మంగళగిరి రూరల్ పోలీసుల విచారణకు హాజరుకాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి విచారణ అంనతరం సజ్జలను పోలీసులు అరెెస్ట్ చేయడం కూడా ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.