ఏఆర్ రెహ్మాన్ .. ఒక సాధారణమైన పేరు కాదు .. అది ఒక సంగీత సామ్రాజ్యం. ఏఆర్ రెహ్మాన్ ఒక వ్యక్తికాదు .. అది స్వరాల విహారం చేసే విశ్వమంతటి విహంగం. రెహ్మాన్ కి ముందు .. ఆ తరువాత కూడా ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చారు. కానీ రెహ్మాన్ కి గల ప్రత్యేకమైన స్థానం అలాగే ఉండిపోయింది. అందుకు కారణం రెహ్మాన్ చేసింది సాధారణమైన బాణీలు కాదు .. ఆయన కూర్చింది పెదాలపై తేలియాడే తేలికైన పాటలు కాదు. ఆయన ప్రతిపాటా మనసు లోతుల్లో నుంచి మంత్రమై పుడుతుంది .. హృదయాలను పల్లకీలుగా చేసి ఊయలలు ఊపుతుంది.
రెహ్మాన్ ఆడుతూ పాడుతూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. ఒక హాబీగా ఆయన సంగీతాన్ని ఎంచుకోలేదు.తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతనిపై పడింది. తల్లీ .. అక్కాచెల్లెళ్ల పోషణ కోసం ఆయన సంగీతం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. పేదరికం .. ఆకలి .. ఆవేదన .. నిస్సహాయత ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆకలిని జయించడం కోసమే ఆయన ఎంచుకున్న ఆయుధంగా సంగీతం కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆయన తనకి గల కొద్దిపాటి సంగీత జ్ఞానంతో ఇళయరాజా .. రాజ్ – కోటి వంటి వారి మ్యూజిక్ ట్రూప్ లలో పనిచేశారు.

Also Read ;- సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ కు మాతృవియోగం
రెహ్మాన్ అసలు పేరు దిలీప్ కుమార్ .. కొన్ని కారణాల వలన ఆయన తన పేరును మార్చుకున్నారు. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగీత దర్శకులకు అంత తేలికగా ఎవరూ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే కథ ఏదైనా ప్రధాన భాగమైన సంగీతమే సినిమాను నడిపిస్తూ ఉంటుంది. అందువలన కొత్త కుర్రాళ్లను నమ్మి పెద్ద ప్రాజెక్టులను ఎవరూ అప్పగించరు. పెద్ద దర్శక నిర్మాతలు అసలు అవకాశమే ఇవ్వరు. అలాంటిది సంగీత దర్శకుడిగా తన తొలి సినిమానే ఆయన మణిరత్నంతో చేయడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రోజా’ ఒక సంచలనం .. పాటల ప్రభంజనం.
ఈ సినిమాలోని ప్రతిపాటా రెహ్మాన్ ను అభిమానుల మనసు శిఖరాలపై కూర్చోబెట్టింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమా నుంచి రెహ్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. దేశం మొత్తం ఆ పాటలు మారుమ్రోగాయి . పడుచు మనసులను పట్టుకున్నాయి .. ఆకట్టుకున్నాయి. ఆయన సంగీతంలో ఏదో తెలియని తీయదనం .. మరేదో కమ్మదనం .. ఇంకేదో హాయిదనం నరనరాల్లో ప్రవహించి అనుభూతుల ఆకాశంలో విహరింపజేసింది. పాటలోని సున్నితమైన భావాలను స్వరాల విన్యాసాలతో మనసులకు చేరేవేసే ఆయన తీరుకు అందరూ ముచ్చటపడ్డారు. ఆయన సంగీతంలో ఏదో మత్తు ఉంది .. గమ్మత్తు ఉంది అని గ్రహించిన దర్శక నిర్మాతలు ఎగబడ్డారు.
‘రోజా’ తరువాత రెహ్మాన్ బాణీలు చేశారనడం కంటే ప్రయోగాలు చేశారంటేనే కరెక్టుగా ఉంటుందేమో. ‘బొంబాయి’ సినిమాలోని ‘హమ్మా .. హమ్మా’ .. ‘ఉరికే చిలకా’ పాటలు, ‘జెంటిల్ మేన్’లోని ‘చికుబుకు చికుబుకు రైలే’ .. ‘డ్యూయెట్’లోని ‘అంజలీ .. అంజలీ’ పాటలు, ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ముక్కాల మూకాబులా .. ‘ .. ‘ఊర్వశి .. ఊర్వశి’ పాటలు .. ‘ముత్తు’లోని ‘థిల్లానా .. థిల్లానా’ .. ‘భారతీయుడు‘లోని ‘పచ్చని చిలకలు .. ‘జీన్స్ ‘లోని ‘ప్రియా ప్రియా చంపొద్దే’ పాటలు .. ఇలా ఒకటేమిటి ఆయన సంగీతం నుంచి ప్రతిపాటా ఒక సమ్మోహనాస్త్రమై సంధించబడింది. ఇటు మెలోడీస్ ద్వారా, అటు ఫాస్ట్ బీట్స్ తోను దేశవ్యాప్తంగా ప్రతి స్వరంలో ఆయన ప్రవేశించారు .. ప్రతి నరంలోను ఆయన ప్రవహించారు.
ఏ వాద్య పరికరాన్ని ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ఉపయోగించాలో రెహ్మాన్ కి బాగా తెలుసు. భారతీయ సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని జోడించి ఎలా మెప్పించాలో తెలుసు. అందువల్లనే ఆయన బాలీవుడ్లో సైతం తన విజయబావుటా ఎగరేశారు. ‘రంగీలా’ .. ‘దిల్ సే’ పాటలను అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఒక చిన్నకుర్రాడు .. తప్పనిసరి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పోషించడం కోసం సంగీతాన్ని సాధనంగా చేసుకున్న కుర్రాడు .. అంచెలంచెలుగా ఎదుగుతూ సంచలనానికి మారుపేరుగా నిలవడమనేది అద్భుతమనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్లతో .. స్టార్ ప్రొడ్యూసర్లతో .. స్టార్ హీరోలతో ఆయన చేసిన ప్రయాణం అనితర సాధ్యమనే అనాలి.
‘స్లమ్ డాగ్ మిలియనియర్’ అనే సినిమాలోని ‘జయహో’ అనే పాట ఆయన ప్రతిభను పతాకస్థాయికి చేర్చింది. సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా ఆయన ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణం, సంగీత సాగరాన్ని అహర్నిశలు మథించడంలో చూపే అంకితభావమే. తనలోని తపనను తపస్సుగా మార్చుకోవడమే. అందువల్లనే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు.
ఒక సాధారణమైన కుర్రాడు తన వీధి నుంచి విదేశాల వరకూ తన కెరియర్ ను పరిగెత్తించాడు. తన ప్రతిభాపాటవాలతో విశ్వమంతటా పరచుకున్నాడు. ఒకే ఆశయం .. ఒకటే లక్ష్యం .. ఒంటరి పోరాటం .. అనుకున్నది సాధించాడు. సంగీత సామ్రాజ్యాన విజేతగా నిలిచాడు. మనసు మనసుకు స్వరాభిషేకం చేశాడు .. పాట పాటకు పట్టాభిషేకం చేశాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ సంగీత సముద్రానికి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Must Read ;- సంచలనానికి మరోపేరు సల్మాన్ (బర్త్ డే స్పెషల్)











