తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించాలన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించే ఈ సిట్ లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారుల, ఫోరెన్సిక్ విభాగానికి చెందిన మరో అధికారి ఉంటారని కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బృందం వీలయినంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి నివేదికను అందజేయాలని కోర్టుే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు… సీబీఐ నుంచి సిట్ లో పనిచేయాల్సిన అదికారులను సీబీఐ డైరెక్టర్ నిర్ణయించనుండగా… ఏపీ నుంయచి ఈ దర్యాప్తులో పాలుపంచుకోనున్న అధికారుల పేర్లను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
ఈ వ్యవహారంపై ఓ కీలక ప్రకటన చేసిన డీజీపీ… అసలు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను సుప్రీంకోర్టు అభిశంసించలేదని తెలిపారు. అయితే ఈ వ్యవహారం అతి సున్నితమైనందున స్వతంత్ర దర్యాప్తు అయితే మంచిదని కోర్టు భావించిందన్నారు. అందేకే స్వతంత్ర దర్యాప్తునకే కోర్టు మొగ్గుచూపిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ఈ సిట్ లో పనిచేసేందుకు సీనియర్ ఐపీఎస్ అదికారులైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపినాథ్ జెట్టిలను ఎంపిక చేశామని, వారి పేర్లనే సుప్రీంకోర్టుకు పంపినట్లుగా తెలిపారు. రాష్ట్రం నుంచి అదికారులను పంపించడం మినహా ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర గానీ, ప్రమేయం గానీ ఉండబోదని డీజీపీ చెప్పారు.
తిరుమల వెంకన్న ప్రసాదం అయిన లడ్డూకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను కలకలమే రేపింది. ఈ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను వేయగానే వైసీపీ శిభిరం ఉలిక్కిపడింది. వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తాము కోరినట్లు సిట్ ను రద్దు చేస్తుందని భావించిన వైసీపీకి కోర్టులో షాక్ తగిలింది. ఆరోపణల స్థాయి, అంశం సున్నితత్వాన్ని గమనించిన కోర్టు… రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలోని సిట్ తో దర్యాప్తు కాకుండా… స్వతంత్ర దర్యాప్తు అవసరమని భావించింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది.