ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలకు ఉపక్రమించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో భాగంగా నాటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్ సంస్థ… పరికరాల కొనుగోలుకు సంబంధించి తప్పుడు ఇన్ వాయిస్ లు సమర్పించిందన్న అంశంపై ఈడీకి స్పష్టమైన లభించాయి. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన ఈడీ… సీమెన్స్ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు… మొత్తంగా రూ.23.54 కోట్లను జప్తు చేసింది. ఈ చర్యకు సంబంధించి ఈడీ నుంచి ప్రకటన వెలువడినంతనే… వైసీపీ శ్రేణులంతా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాయి. చంద్రబాబుకు ఈడీ షాకిచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశాయి.
అయితే సీమెన్స్ ఆస్తుల జప్తుకు సంబంధించిన ఈడీ నోట్ లో ఏపీ ప్రభుత్వం గానీ, సీఎం చంద్రబాబు పేరు గానీ అసలు ప్రస్తావనకే రాలేదని చెప్పాలి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు సీమెన్స్ వి అయితే.. ఈడీ చర్య చంద్రబాబుకు షాక్ ఎలా అవుతుందన్న విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపై అనుమానం వచ్చిన కొన్ని మీడియా సంస్థలు… దీనిపై క్లారిటీ తీసుకునేందుకు ఈడీ అధికారులను సంప్రదించాయి. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో భాగంగా సీమెన్స్ ఆస్తుల అటాచ్ మెంట్ రొటీన్ గానే జరిగిందని ఓ ఈడీ అధికారి తెలిపాారు. అంతేకాకుండా ఈ చర్యకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సదరు ఈడీ అధికారి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా తాము జరిపిన దర్యాప్తులో ఎక్కడ కూడా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా తమకు అనిపించలేదని వివరించారు. చంద్రబాబుతో పాటుగా స్కాం జరిగినప సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి కూడా ఎలాంటి సంబంధం ఉన్నట్లుగా తమకు కనిపించలేదన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలను ముఖ్యమంత్రితో ముడిపెట్టడం సరికాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా సీమెన్స్ ఆస్తుల జప్తు, దానిపై వైసీపీ శ్రేణులు చేసిన రచ్చతో దర్యాప్తు సంస్థ నుంచే చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చేసినట్టైంది.